కోదాడ, ఆగస్టు 25 : రైతును రాజును చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు కడగండ్లు తెచ్చింది. రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదనడానికి అనంతగిరి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులే సాక్షి భూతం. సోమవారం అనంతగిరి పీఏసీఎస్ ఎదుట బస్తా యూరియా కోసం తెల్లవారుజామున 5 గంటలకే పడిగాపులు కాస్తున్న దుస్థితి. గంటల తరబడి నిలబడే ఓపిక లేక తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి.
గత ప్రభుత్వంలో సమృద్ధిగా అవసరమైనంత యూరియా సరఫరా అయిందని నేడు ఆ పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు రైతులు వాపోయారు. మండలానికి సరిపడా యూరియా అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకునేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో వ్యవసాయ అధికారులు వచ్చి అవసరమైన యూరియా అందిస్తామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ది చెప్పడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు
వారం రోజుల నుండి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నప్పటికీ ప్రభుత్వానికి దున్నపోతుపై వర్షం కురిసినట్టు ఉంది. గత ప్రభుత్వంలో ముందస్తుగానే రైతులకు సరిపడా యూరియాను దిగుమతి చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు మేలు చేయాలని చిత్తశుద్ధి లేదు. పాలన గాడి తప్పింది. తక్షణమే యూరియా సరఫరా చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తాం.