నేరేడుచర్ల, జులై 07 : రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాసీల్దార్ కార్యాలయం ఎధుట అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భాతర రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికి రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పరికరాలు అందుబాటులో లేవన్నారు. రుణాలు సక్రమంగా అందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం గత ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్ధాయిలో అమలు చేయడం లేదన్నారు.
కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రైతులకు పంట రుణాలు, రైతు భరోసా, రైతు బీమా వర్తింపజేయాలన్నారు. ప్రతి గ్రామానికి ఒక వ్యవసాయ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసీల్దార్ సురిగి సైదులుకు వినితి ప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సమాఖ్య కేంద్ర కమిటీ సభ్యురాలు వస్కుల సైదమ్మ, మండల నాయకులు కస్తాల సందీప్, అమరవరపు బాబు, గోపాల్‌దాస్, వినయ్, మౌనిక, చరణ్, ఇమ్మానుయేల్ పాల్గొన్నారు.