సూర్యాపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : హుజూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ ఈ స్కీం కొసెల్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసేశాం.. రైతు భరోసా డబ్బులు ఇచ్చేశాం అంటూ పచ్చి అబద్ధాలు అడడం పట్ల సన్నబియ్యం పథకం అమలు విషయంలో అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్క సూర్యాపేట జిల్లా వరకే పరిశీలిస్తే వచ్చే నాలుగు నెలల వరకు సరిపడా బియ్యం ఉన్నాయని అధికారులు చెబతుండగా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంటుందనేది అంచనా. ఒకవేళ ప్రభుత్వం సన్నబియ్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు ఇవ్వాలంటే ఇప్పటికే ఖజానా ఖాళీ అంటూ పదేపదే చెబుతున్న రేవంత్రెడ్డి మరి అత్యధిక ధరలు ఉండే సన్నాలను ఎలా కొంటారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
రాష్ట్రంలో గత సీజన్ వరకు ప్రభుత్వం దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయగా సన్నాలకు అధిక ధరలు ఉండడంతో రైతులు వాటిని బహిరంగ మార్కెట్లోనే విక్రయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు రూ.500ల బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీను తుంగలో తొక్కి కేవలం సన్నాలకు మాత్రమే ఇచ్చింది. సన్న వడ్లను పండించిన రైతులు మెజారిటీ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకోగా కొంత మేర మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. వాటికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో రైతులకు ఇంకా రూ.20 కోట్లకు పైనే బోనస్ బకాయి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ సీజన్లో రైతులు జిల్లా వ్యాప్తంగా 55 శాతానికి మించి సన్నధాన్యం సాగు చేయలేదు. యాసంగిలో వాతావరణం అనుకూలించదని దొడ్డురకమే సాగు చేస్తుంటారు. పైగా ఇప్పటికే వరి కోతలు జోరుగా సాగుతుండగా ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేందుకు తూతూ మంత్రంగా కూడా చర్యలు చేపట్టకపోవడంతో మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వం గత సీజన్లో కొనుగోలు చేసిన సన్నధాన్యం సీఎంఆర్ ద్వారా రైస్ తీసుకోగా ఈ సారి ఉలుకూపలుకూ లేకపోవడం పట్ల సన్నబియ్యం ఎలా సమీకరిస్తారనేది ప్రశ్నార్థకమే.
ముఖ్యమంత్రి నుంచి మొదలు కుంటే మంత్రులు నోరు తెరిస్తే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న విషయం విదితమే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అరకొరగా కూడా అమలు చేయకపోగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో పాలన ఉంది. పైగా రైతులకు రుణమాఫీ చేశాం… రైతు భరోసా ఇచ్చామంటూ పదేపదే అబద్ధాలు చెబుతుండడం పట్ల దాదాపు 60శాతం మంది రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పాటు కాళేశ్వరం జలాలు రాక పంటలు ఎండిపోతుంటే ఎండలకు ఎండిపోతున్నాయని సీఎం అనడం… అలాగే అసలు కాళేశ్వరం జలాలే రాలేదు… గతంలో వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లని పచ్చి అబద్ధాలు చెబుతుండడం పట్ల సన్నబియ్యం పథకం కూడా హుళక్కే అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పస్తుతం ప్రభుత్వం వద్ద సన్న బియ్యం నాలుగు నెలల వరకు సరిపడే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తుండగా తదనంతరం ఈ పథకాన్ని అమలు చేయాలంటే నెలనెలా రూ.2,858 వేల కోట్ల అదనపు భారం పడుతుందని స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హుజూర్నగర్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం క్వింటాకు రూ.4,500 నుంచి 6వేల వరకు ఉండగా ఖజానా ఖాళీగా ఉన్నదంటున్న ప్రభుత్వం నెలనెలా ఈ నిధులు ఎలా సమకూర్చనుందో దేవుడికే తెలియాలి.