కోదాడ రూరల్/తిప్పరి, ఏప్రిల్ 8 : ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేయాలని పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేయకపోవడంతో నిరసన చేపట్టారు. కోదాడ మండలం తమ్మరలో హడావుడిగా కేంద్రాన్ని ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మంగళవారం ఐకేపీ సెంటర్ ఎదురుగా కోదాడ- ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దాంతో వాహనాలు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి వచ్చి నిరసనను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో కేవలం టెంట్ మాత్రం వేశారని, స్థానిక సిబ్బందికి రసీదు బుక్కులు ఇవ్వలేదని, మ్యాచర్ మిషన్, గన్నీ బస్తాలు, సన్నాలు కొలిచే మిషన్, బ్లోయర్లు లేకుండా కొనుగోలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఆర్భాటం తప్ప ఆచరణ శూన్యమని విమర్శించారు. నిరసనలో సీపీఐ, బీజేపీ నాయకులు బొల్లు ప్రసాద్, కనగాల నారాయణరావు, రైతులు నన్నె సాహెబ్, జల్లా జనార్దన్, మల్లెబోయిన వెంకటేశ్‌బాబు, పుల్లయ్యచౌదరి, సామినేని సుబ్బారావు, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజులుగా పలు కారణాలు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని తిప్పర్తిలో రైతులు నిరసన చేపట్టారు. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. కొనుగోళ్లు చేయకపోవడంతో అకాల వర్షం తో ధాన్యం తడిసే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చార్మి రకం వడ్లు కొంచెం సన్నగా ఉండడం వల్ల తాలు పేరుతో మిల్లర్లు లారీలను నిలుపుతున్నారని, అధికారులు మిల్లర్లతో మాట్లాడి వెంటనే దిగుమతి అయ్యే విధంగా చూడాలని కోరారు.
గత ప్రభుత్వం వర్షానికి తడిసిన, మొలకలు వచ్చిన వడ్లను సైతం కొన్నది. ఇప్పుడు తాలు, తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నరు. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నయ్. చార్మి రకం వడ్లు ప్రభుత్వం ఇచ్చిన సీడ్స్. ఇప్పుడు రైతులు పండించిన తర్వాత తాలు ఎక్కువగా ఉందని కొర్రీలు పెట్టడం సరికాదు. వెంటనే రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వడ్లను కొనాలి.
– గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, రైతు, తిప్పర్తి
నాలుగు రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనడం లేదు. ధాన్యం తూర్పారా పట్టి తేవాలని కాంటాలను ఆపుతున్నరు. రోజుకో అధికారి వస్తుండు పోతుండు కానీ కాంటాలు మాత్రం పెట్టడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన వడ్లనే మేము పండించాం. కానీ ఇప్పుడు వాటిని ఆపుతున్నారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు చేపట్టి మిల్లుల వద్ద తొందరగా దిగుమతి అయ్యే విధంగా చూడాలి.
– బత్తుల సోమరాజు, రైతు, తిప్పర్తి