– నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్
చందంపేట, జూలై 29 : ఎల్ నినో దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్, చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదని, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు తాగునీటిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని, సక్రమ నీటి సరఫరాతో పాటు, ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా చూడాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటల పై అవగాహన కల్పించాలని, కందులు, కూరగాయలు ,కీర దోస వంటి పంటలు సాగు చేసుకునేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఎట్టి పరిస్థితిలో భూములు పడావుగా ఉంచవద్దని, ఆరుతడి పంటలు వేసుకునేందుకు ఎంత విత్తనం కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు యూరియా తక్కువగా వాడేలా చూడాలని ఏఓను ఆదేశించారు.
వీబీ జి రామ్ జీ కింద గ్రామాల వారిగా అవసరమైన అన్ని పనులను చేపట్టాలని, జలసిరి కింద నీటి సంరక్షణ నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్ పిట్స్ చేపట్టాలన్నారు. వీబీ జీ రామ్ జీ కింద అన్ని గ్రామ పంచాయతీలలో పనులు ఉండేలా చూడాలని చెప్పారు. ఊట కుంటలు, చెరువులలో పూడికతీత, గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నిర్మాణం, అంగన్వాడీ నిర్మాణం, సోక్ పిట్లు, సోలార్ లైట్ల వంటి పనులకు అంచనాలు రూపొందించి మంజూరు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో భాగంగా మండలంలో వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను పునరుద్ధరించాలని, అంగన్వాడీ పనులు, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మండలంలో రెండవ విడత మంజూరైన ఇళ్ల నిర్మాణానికి గుడిసెల పరిశీలన కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి విడతలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి చెల్లింపులు ఆపవద్దని, అలాగే పెండింగ్లో ఉన్న పనులను కొనసాగించాలని అన్నారు. ప్రస్తుతం ముసురుతో కూడిన వర్షం పడుతున్నందున వనమహోత్సవం కింద మొక్కలు నాటాలని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎంపిడిఓ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. గువ్వలగుట్టలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటుపై శ్రద్ధ తీసుకోవాలని ఆర్డిఓ పద్మ ప్రియను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ బి.పద్మప్రియ, తాసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

‘రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలి’