(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ‘అధికారంలో మీరైనా ఉండాలి. లేకపోతే, మేమైనా ఉండాలి. మూడో పార్టీకి అందునా ప్రాంతీయ పార్టీకి అస్సలు చాన్స్ ఇవ్వొద్దు’.. పైకి బద్ధ శత్రువులుగా కనిపించే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ మేరకు లోపాయికారి ఒప్పందం ఏమైనా కుదిరిందా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. పార్టీ కీలక నేతలతో మంగళవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ సమయంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేశారు. ‘మేము అధికారం నుంచి దిగిపోతే, మీరే వస్తార’ని మోదీ, షా తనతో అన్నట్టు రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అధికార పక్షమే నమ్ముతున్నప్పుడు, మీరు కూడా నన్ను విశ్వసించాలం’టూ రాహుల్ తన పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పార్టీలు కావని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకొన్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాహుల్ తాజా వ్యాఖ్యలను విశ్లేషిస్తే, ఇది నిజమేననిపిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ అమలు చేసిన వ్యూహాలను ఉదహరిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తొలుత ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టడం, అవసరం తీరిపోయిన తర్వాత మిత్ర ధర్మానికి తూట్లు పొడవడం అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి కొత్తేం కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, డీఎంకేతో 55 ఏండ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకొని విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపింది. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలకు తెరతీసిందని, ఇక భవిష్యత్తులో ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని డీఎంకే కూడా తేల్చిచెప్పింది. కాంగ్రెస్ వైఖరి నచ్చక ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఇండియా కూటమికి ఇంతకుముందే గుడ్‌బై చెప్పింది. మొన్నటికి మొన్న బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పరాజయం పాలైతే కాంగ్రెస్ నేతలు తొలుత సంబురాలు చేసుకొన్నారు. ఇక, కూటమి పార్టీల్లో చీలికలు ఏర్పడితే, భరోసా ఇవ్వాల్సిన కనీస ధర్మాన్ని మరిచిన కాంగ్రెస్.. వేడుక చూస్తూ, ఆ పార్టీల అంతర్గత కుమ్ములాటను ఎగదోసే ప్రయత్నం చేసిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, బెంగాల్లో ప్రస్తుత టీఎంసీ ఉదంతాలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.
ఇటు బీజేపీ వైఖరి కూడా ఇలాగే ఉన్నదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొన్న ప్రాంతీయ పార్టీలు ఆ తర్వాతి కాలంలో బలహీనమైనట్టు చెబుతున్నారు. మహారాష్ట్రలో శివసేన పార్టీలో, బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీలో (ఎల్జేపీ) చీలికలు ఏర్పడి ఆ పార్టీలు బలహీనం కావడానికి బీజేపీనే ప్రధాన కారణమని గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు బలమైన పార్టీలుగా ఉన్న బీహార్‌లోని జేడీయూ, కర్ణాటకలోని జేడీఎస్, పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), వంటి పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకొన్న తర్వాత క్రమక్రమంగా బలహీనమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.