కోదాడ, ఆగస్టు 07 : రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన అవసరమని తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో, పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో సాగు న్యాయ యాత్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించ బడినప్పుడే నిజమైన సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యత లేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో పలు దేశాల్లో భూ చట్టాలను సమర్థంగా వినియోగిస్తూ రైతులు లబ్ధి పొందుతున్నారని, అలాంటి అవగాహన మన రైతులకూ ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయనీ, అవన్నీ రైతులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి రైతు మరో పది రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అంతేకాకుండా వినూత్న పంటల సాగు వైపు దృష్టి సారించాలని, అధిక ఎరువుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురైతున్నట్లు చెప్పారు. రైతులు సభలో పలు సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ వాజీద్, ఏఓ రజిని, డీ.ల్.సీ వంగవీటి రామారావు, ఎర్రవరం ప్యాక్స్ చైర్మన్ నల్లజర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.