నల్లగొండ ప్రతినిధి, మే20 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పడిగాపులు తప్పడంలేదు. గత నెల రెండు, మూడో వా రంలో ధాన్యం తెచ్చిన రైతులు సైతం నేటికి కాంటాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో సజావుగా సాగిన కొనుగోళ్ల ప్రక్రియ కాంగ్రెస్ సర్కార్ హయాంలో మాత్రం ఆగుతూ… సాగుతూ ఉంది. ఈ విషయమై క్షేత్రస్థాయి కేంద్రాల్లో ఏ రైతును కదిలించినా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఒక్కో రైతు నెల రోజులకు పైగానే కాంటాల కోసం ఎదురుచూస్తున్నారు.
కొనుగోళ్లల్లో కీలకమైన మిల్లర్ల తీరు, లారీల సరఫరా, హామాలీల కొరత, గన్నీ బ్యాగుల సేకరణపై పర్యవేక్షణ కొరవడిందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టగా మరో పక్షం రోజులకు పైగా సమయం పట్టేట్లు ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలోని 410 కేంద్రాలకు గాను 7,01,249 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల కోసం వచ్చింది. అయితే బుధవారం నాటికి 5.91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటా అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత నాలుగైదు రోజులుగా రోజూ సగటున 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటా అవుతున్నట్లు చెప్తున్నారు.
అయితే ఇందులో కేంద్రాల్లో కాంటా అయ్యాక కూడా ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ జారీ, మిల్లర్లు ఓకే చెప్పడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. కాంటా అయ్యాక చాలా చోట్ల లారీలు, హామాలీలు, మిల్లుల్లో దిగుమతికి స్థలం కొరతతో ధాన్యం తరలింపులో కాలాయాపన జరుగుతోంది. అందువల్ల కాంటా అయిన లెక్కలకు, ట్రక్‌షీట్ జారీ లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కాంటా అయిన ధాన్యంలో 4.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే ట్యాబ్ ఎంట్రీ కాగా అందులోనూ 4.39 లక్షల టన్నులకు ట్రక్ షీట్ జనరేటైంది.
ఇందులోనూ రైసు మిల్లర్లు తమ మిల్లుల్లో దిగుమతి అయ్యాక ఒకే చెప్పిన ధాన్యం 4.23లక్షల మెట్రిక్ టన్నులు. అంటే కాంటా అయిన ధాన్యంలోనూ ఇంకా 2.78లక్షల టన్నుల ధాన్యానికి అధికారిక గుర్తింపు రావాల్సి ఉంది. అలా వస్తేనే రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేందుకు వీలవుతుంది. రూ.1413.57 కోట్ల విలువైన ధాన్యం కాంటా కాగా ఇప్పటివరకు రూ.1010.67 కోట్లు చెల్లించినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇంకా కాంటా పూర్తయిన 16వేల మంది రైతులకు సంబంధించిన రూ.403 కోట్ల విలువైన ధాన్యానికి చెల్లింపులు చేయాల్సి ఉంది.
కొనసాగుతున్న తరుగు కోతలు
జిల్లాలో తాలు, తరుగు పేరుతో ఆది నుంచి మొదలైన కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రాల్లో క్వింటాల్‌కు నాలుగైదు కిలోలు, మిల్లుల వద్ద మరో మూడు నాలుగు కిలోల చొప్పున కోతలు పెడుతున్నారు. దీంతో రైతులు క్వింటాల్ ధాన్యంపై 8 నుంచి 10 కిలోల వరకు నష్టపోతున్నారు. దీనికి ఒప్పుకుంటేనే చాలాచోట్ల ధాన్యం కాంటాలు వేయడంతో పాటు మిల్లుల్లో దిగుమతి చేస్తున్నారు. లేకుంటే రైతులు అలాగే నిరీక్షించాల్సి వస్తోంది. తాజాగా కనగల్ మండలం జి.యడవెల్లిలో గత నెల 15న ముగ్గురు రైతులకు చెందిన ధాన్యాన్ని కేంద్రంలో తూకం వేసి 713 బస్తాల్లో 285.20 క్వింటాళ్ల ధాన్యం మిల్లుకు పంపించారు.
అయితే అదే ధాన్యం మిల్లులో దిగుమతి అయ్యాక ట్రక్ షీట్లో తరుగు పేరుతో కోత విధించి మరో లెక్క రాశారు. 691 బస్తాలే వచ్చినట్లుగా వాటిల్లో 276.40 క్వింటాళ్ల ధాన్యమే దిగుమతి చేసుకున్నట్లుగా ట్రక్‌షీట్‌లో ఫైనల్‌గా నమోదు చేశారు. అంటే ఈ ఒక్క లోడ్ లారీలోనే 19 బస్తాల ధాన్యం మాయం కాగా 8.80 క్వింటాళ్ల ధాన్యానికి కోత విధించారు. దాదాపు రూ.21వేలు రైతులు నష్టపోయారు. దీనిపై ఆధారాలతో సహా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. రైతులు నష్టపోయిన ధాన్యం డబ్బులు ఇప్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలాగే దాదాపు అన్ని చోట్ల కోతలు విధిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా..
క్షేత్రస్థాయిలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను బుధవారం నమస్తే తెలంగాణ బృందం పరిశీలించింది. కేంద్రాల వారీగా వచ్చిన ధాన్యం… కాంటా అయిన ధాన్యం… ఎన్ని రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు… ప్రధాన సమస్యలు ఏమిటనే అంశాలపై రైతులను, కేంద్ర నిర్వాహకులను కదలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. లారీల కొరత, హమాలీల సమస్య, గన్నీ బ్యాగుల కొరత, మిల్లుల్లో దిగుమతి కోసం ఎదురు చూపుల వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి.