సూర్యాపేట, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే కోతలు పూర్తయినా కొనుగోళ్లు మాత్రం పూర్తి కాలేదు. 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ సీజన్లో కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 2.02 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. వాటిలో ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిన సన్నాలు కేవలం 6296 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా, దొడ్డు రకం మాత్రం 1.96 లక్షల మెట్రిక్ టన్నులు ఉం డడం గమనార్హం. రైతులు సన్న ధాన్యాన్ని తక్కువ ధరకే తెగనమ్ముకునేంత వరకు వేచి చూసి, గొప్పలు చెప్పుకునేందుకు చివరలో కేం ద్రాలు ప్రారంభించారు. ప్రస్తుతం అనేక కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం తెచ్చి 20 నుం చి 30 రోజులుగా కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు.
ఉత్తమ్ జిల్లాలోనే రైతులకు కష్టాలు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లాకు ఏమైంది..? రైతులపై ఎవరైనా కక్ష కట్టారా.. తీరని అన్యాయం జరుగుతున్నా కనీసం పట్టించుకున్న వారే కరువయ్యారు. పండిన పంట మద్దతు ధరకు అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఓపెన్ చేయలేదు. ఈ పరిస్థితిని చూస్తుంటే జిల్లా రైతులపై కక్ష కట్టినట్లే కనిపిస్తుంది. నెల రోజుల క్రితం కోతలు పూర్తి కాగా దాదాపు 50 శాతం ధాన్యాన్ని రైతులు ప్రైవేట్‌కు విక్రయించుకున్న తరువాత కేంద్రాలను నెమ్మదిగా ప్రారంభించారు.
ఉన్న ధాన్యం అయినా వేగంగా కొనుగోలు చేస్తున్నారా అంటే అదీ లేదు. తేమ శాతం అధికంగా ఉండటంతో ఆలస్యం జరుగుతోందని పలు చోట్ల అధికారులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉంది. ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదవుతుండగా సెంటర్లకు తెచ్చిన ధాన్యం దాదాపు నెల రోజులకు ముందే వచ్చింది. నాటి నుంచి రైతులు నిత్యం తమ ధాన్యం వద్దకు రావడం, అధికారులు రేపుమపంటూ చెప్పడంతో వెనుదిరిగి వెళుతుండటం రివాజుగా మారింది. జిల్లాలో ప్రస్తుత సీజన్లో 2.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వాటిలో1.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు షిఫ్ట్ చేయగా మరో 13వేల మెట్రిక్ టన్నులను షిఫ్ట్ చేయాల్సి ఉంది.
27,989 మంది రైతులకు గాను 19 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడగా 8970 మంది రైతుల ఖాతాల్లో మరో రూ.200 కోట్లు పడాల్సి ఉంది. దీంతో ఆ రైతులంతా ఎదురు చూస్తున్నారు. కాగా జిల్లాకు పెట్టుకున్న టార్గెట్‌లో ఇంకా రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం జిల్లాలోని కొనుగోలు సెంటర్లలో దాదాపు 50 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. టార్గెట్‌లో సగం కూడా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామని గొప్పలు చెప్పగా జిల్లాలో 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే అందులో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నులపైనే సన్నాలు ఉండగా ఇప్పటి వరకు జిల్లాలో కొనుగోలు చేసింది మాత్రం 6296 మెట్రిక్ టన్నులకు మాత్రమే బోనస్ వర్తించనుంది. ఈ లెక్కన రైతులకు జరిగే నష్టం, మోసం ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేసి, రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తే తమకు వర్షాల భయం ఉండదని రైతులు పేర్కొంటున్నారు.
వడ్లు పోసి 20 రోజులవుతోంది…
తుంగతుర్తి, మే 11: ఐకేపీ కేంద్రంలో ధాన్యం పోసి 20 రోజులు అవుతున్న కూడా ఇప్పటి వరకు వడ్లు కాంట వేయడం లేదు. వర్షాలు, ఈదురుగాలి మబ్బులు పట్టినప్పుడుల్లా చేతికి వచ్చిన పంట ఏడ తడిసి ముద్ద అవుతుందని భయపడుతున్నామని తెలిపారు. ఐకేపీ నిర్వాహకులను అడిగితే లారీలు రావడం లేదని లోడ్ అయిన లారీలు మిల్లర్లు దగ్గర దిగుమతి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. జిల్లా అధికారులు సకాలంలో స్పందించి త్వరగా వద్ద కాంటాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
-తడకమళ్ల రైతు, తుంగతుర్తి
25 రోజులు అవుతున్నా కాంటాలు కాలేదు..
అర్వపల్లి, మే 11: నేను మా ఊళ్లో ఐకేపీ సెంటర్‌కు ధా న్యాన్ని తీసుకొచ్చి 25 రోజులు అవుతుంది. లారీలు రాక కాంటాలు కాకపోవడంతో తిండి తిప్పలు మాని రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుంది. 400 బస్తాల ధాన్యాన్ని పోసి అకాల వర్షాలతో భయపడాల్సి వస్తుంది. నిర్వాహకులు ఇష్టానుసారంగా, సీరియర్ ప్రకారం కాకుం డా వాళ్ళకు కావాల్సిన వారి ధాన్యాన్ని కాంటాలు వేస్తున్నారు. క్వింటాకు రెండు కేజీల పైగా తరుగు తీస్తున్నారు. బస్తాలు తడవకుండా చూడాల్సిన బాధ్యత మాదే కాబట్టి టార్పాలిన్లను తీసుకొచ్చి జాగ్రత్త పడుతున్నాం. వానొస్తే నీళ్లు వడ్ల కింద నుండి పోయే అవకాశం ఉంది. రోజుల తరబడి కాంటాలు వేయడం కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి కాంటాలు త్వరగా జరిగేలా చూడాలని తెలిపారు.
-సంపతి కిరణ్‌కుమార్ రైతు వేల్పుచర్ల