హాలియా : నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగు గ్రామంలో రైతు బంధు వారోత్సవాలను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్ర నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలుతో కలిసి సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయించడం వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 10 వేల రూపాయల పెట్టుబడి సాయం ఇలా అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.
గడిచిన నాలుగు సంవత్సరాలలో రైతు బంధు పథకం కింద రైతులకు 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలో ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.