సూర్యాపేట, ఆగస్టు 7 : కాయకష్టం చేసి కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా కొందరు అడ్డుకుంటూ చంపుతామని బెదిరిస్తున్నారని ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని, కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం కంటతడి పెట్టుకున్న ఘటన సూర్యాపేట కలెక్టరేట్లో గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతు గడ్డం సత్యనారాయణరెడ్డి, భార్య సులోచన, కుమారుడు హరీశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్.ఎస్ మండలంలోని కోటపహాడ్లో 209, 210 సర్వే నెంబర్లలో పదేండ్లక్రితం 8.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తలా మూడెకరాల చొప్పున పట్టా చేయించుకున్నారు.
ఎనిమిదేండ్లుగా కబ్జ్జాలో ఉండి సాగు చేస్తున్నప్పటికీ, రెండేండ్లుగా గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషులు ఎలాంటి ఆధారాలు లేకుండా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ భూమిలో నుంచి 30గుంటల వరకు కబ్జా చేశారని, అడ్డు వెళ్లిన తమపై దాడి చేయగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రస్తుతం తమ భూమికి వెళ్లేందుకు దారి లేదంటూ తమను భూమిపైకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రస్తుతం వారు మమ్మల్ని భూమిపైకి వెళ్లనీయకుండా చంపుతామంటూ బెదిరిస్తున్నారన్నారు. రెండేండ్లుగా మా పొలం మొత్తం బీడుగా మారిందని, మా పరిస్థితి దయానీయంగా ఉందని ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమ భూమి తమకు అప్పగించి సదరు వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.