ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కోసం రైతులకు రోజూ తిప్పలు తప్పడం లేదు. అర్వపల్లిలో హైవేపై యూరియా కోసం వేచి చూడడం జాతరను తలపించింది. తిరుమలగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు, వలిగొండలో మహిళా రైతులు, నల్లగొండ మండలం గొల్లగూడ రైతు వేదిక వద్ద, నాగారం మండల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరులో అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాశారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు రైతులు భారీగా తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో, తిప్పర్తిలో నారట్పల్ల్లి అద్దంకి హైవేపై యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండలో క్యూలో పడిగాపులు పడ్డారు. సూర్యాపేట వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట రాత్రి చలిలో దుప్పట్లు కప్పుకొని నిద్రించారు.
నీలగిరి, సెప్టెంబర్ 12: ‘రాష్ట్ర ప్రభుత్వం యూరియాను సకాలంలో రైతులందరికీ అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా జిల్లాలో యూరియా రైతులకు అందకుండా అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా, పకదారి పట్టించినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సమాచారం అందించాలి. అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం’ అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహకార సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల ద్వారా యూరియాను సరఫరా చేస్తున్నారని తెలిపారు.