కట్టంగూర్, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాములలోని ఐకేసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సమస్యలను రైతులను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ రైతు సంఘాల పేరిట సోసైటీలు ఏర్పాటు చేసిన రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని పోసి నెల రోజులు దాటినా కాంటాలు వేయడం లేదని, ప్రభుత్వ, మిల్లర్లు మధ్య సయన్వయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు చేయాలనే సంకల్పం, చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్రాల్లో దళారి వ్యవస్ధతో రైతుల రక్తాన్ని తాగుతున్నారని, అన్నదాతల ఊసురు తప్పక తాకుతుందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రూ.5 వేల నుండి 10 వేల వరకు నిర్వాహకులకు లంచాలు ఇచ్చుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ధాన్యం కొనుగోళ్లపై నోరుమెదపకపోవడం అంతర్యం ఏమిటోనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంలో పని చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు.
లారీలను కూడా రైతులే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు నిర్వాహకులు చెప్పడం సిగ్గుచేట్టరన్నారు. కాంటా వేసిన రైతుల ధాన్యం బస్తాలను లారీల కొరత సాకుతో మిల్లులకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తల ధాన్యాన్ని కొనుగోళ్లు చేయకుండా అధికారులు, నిర్వాహకులు వేదిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచ్ బెల్లి సుధాకర్, పార్టీ నాయకులు వడ్డె సైదిరెడ్డి, గోలి శివ పాల్గొన్నారు.