నల్లగొండ సిటీ ఏప్రిల్ 30 : యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. ప్రభుత్వ అలసత్యం, పట్టింపులేని తనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కొసి నెల రోజులైనా వడ్లు కోనే దిక్కు లేదు. వానాకాలం దగ్గర పడుతున్నా ఇంకా చాలా కేంద్రాల్లో 20 శాతం కూడా కొనుగోలు కాలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో పడి ఉండటమే కాకుండా కొనే దిక్కు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాటి బయటకు వెళ్లడం లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం, మిల్లర్లు కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అక్కడక్కడా రైతులు ఆందోళనలకు దిగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఓవైపు ఎండల తీవ్రత, మరో వైపు అకాల వర్షాల భయం, మరో వైపు కల్లాలు దాటని వడ్లను చూస్తూ రైతులు ఆవేదనతో కుమిలి పోతున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక వర్షాల నుంచి కాపాడుకోలేక రైతులు సతమతమవుతున్నారు.
యాసంగి పంట కోసి నెల రోజులు దాటినా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లు కల్లాలు దాటడం లేదు. ఓవైపు ఆకాల వర్షాలు వెంటాడుతుండగా మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్న దాతలను ఆగం చేస్తోంది. వడ్లను దిగుమతి చేసుకోకుండా తాలు పేరుతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొనుగోళ్లు ఇప్పటికే 60 శాతం పూర్తి కావాల్సి ఉండగా ఎక్కడా ఆ పరిస్థితి లేదు.
సెంటర్ల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవాల్సిన మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. తాలు పేరిట, మట్టి పెళ్లల పేరుతో అన్లోడ్ చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా పంపిన ధాన్యానికి మిల్లర్లు కొర్రీలు పెడుతూ అన్లోడ్ చేసుకోవడం లేదని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మిల్లర్లు చేతులెత్తేయడం,అధికారులు స్పందించక పోవడం,లారీ కాంట్రాక్టర్లు సైతం ముందుకు రాకపోవడం తదితర సమస్యలతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, అన్నదాతలకు తల నొప్పిగా మారింది.
ధాన్యం కొనేందుకు మిల్లర్లు సుముఖత చూపడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన దొడ్డు రకం వడ్ల లారీలను మిల్లులకు పంపితే వారు దించుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి లారీలు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ధాన్యం దిగుమతి కాకపోవడంతో కాంటాలు పెట్టేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభమై నెలరోజులు కావొస్తున్న ఎందుకు కాంటాలు వేయడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. దీంతో మిల్లర్లు ధాన్యం కొనేందుకు సుముఖంగా లేరని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.
కనగల్ మండలంలో 24 ఐకేపీ సెంటర్లతో పాటు 5 పీఏసీఎస్ సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నారు. మండలంలో సుమారు 4లక్షల 50 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికి 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఏపీఎం తెలిపారు. ఇంకా సగానికి పైగా ధాన్యం సెంటర్లలోనే ఉంది. ఇటీవల లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి.
ప్రభుత్వం ఎన్నికల ముందు సన్న రకానికి రూ.500 ఇస్తామని, గత ఏడాది బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసగించడంతో రైతులు ఈసారి పెద్ద మొత్తంలో దొడ్డు రకం వడ్లు సాగు చేశారు. గతేడాది ప్రభుత్వం బోన స్ ఇవ్వకపోవడంతో రైతులు ఈసారి దొడ్డు రకం పంట సాగు చేశారు. గతంలో కలెక్టర్ జోక్యం చేసుకొని మిల్లర్లతో మాట్లాడి వడ్లు దిగుమతి చేసుకునేలా చేశారు. అదే మాదిరిగా ప్రస్తుతం కూడా అధికారులు కల్పించుకుని మిల్లర్లు ధాన్యం దించుకునేలా చూడాలని రైతులు, కొనుగోలు దారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మిల్లర్లు తాలు పేరుతో కొర్రీలు పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక నిర్వాహకులు రైతులతో మాట్లాడి బస్తాకు 40 కిలోల 700 గ్రాములకు బదులు బస్తాకు 42 కిలోల తూకం వేస్తున్నారు.అలాగే లారీ యజమానులు బస్తాకు రూ.1 చొప్పున ఇవ్వాలని, లేక పోతే ధాన్యం తీసుకెళ్లబోమని కొర్రీలు పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక రైతులు బస్తాకు రూపాయి చొప్పున బిల్లులో పట్టుకుంటున్నారు.
ధాన్యాన్ని సెంటర్లో పోసి 20 రోజులు కావొస్తున్నా ఇంకా కల్లాల్లోనే ఉన్నది. తాలు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. వడ్లు ఎండకు ఎండుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వాటిపై టార్పాలిన్లు కప్పి ఉంచాం. ప్రభుత్వం ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలి.
కొనుగోలు సెంటర్లలో ధాన్యం పోసి 25 రోజులు కావొస్తున్న ధాన్యం కొనే దిక్కు లేదు. రోజుల తరబడి కొనుగోళ్లు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుల బాధలు పట్టించుకునే వారే లేరు.అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలకే వడ్లు పరిమితమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎటు తిరిగినా రైతుకే నష్టం. గత ప్రభుత్వ హయాంలో దోపిడీ లేకుండా కొనుగోలు చేసేవారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేయాలి.