ఆ వరి వంగడం నాసిరకమో లేక నకిలీదో తెలియదు కానీ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా సదరు విత్తనాలు వేసిన రైతులకు కోతలు ఎప్పుడు చేపట్టాలో అర్థం కావడం లేదు… ఎప్పుడో ఒకప్పుడంటూ కోత కోస్తే దిగుబడి గణనీయంగా తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు. 120 రోజులకే పంట చేతికి వస్తుందని ఆ వంగడం వేసిన రైతులు రెండు సార్లు ఈని రెండు వేర్వేరు కంకులు వచ్చాయని వాపోతున్నారు. ఈ విషయమై కంపెనీ రిప్రజెంటేటివ్‌లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ సూర్యాపేట జిల్లాలో కావేరి టిల్లు వంగడాలు నాటిన రైతుల దుస్థితి.
సూర్యాపేట, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ విత్తన కంపెనీల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోగా ఈ సంవత్సరం కూడా అదే పునరావృతమైంది. యాసంగి సీజన్లో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కావేరి టిల్లు వరి వంగడం వేసిన రైతులు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఒకేసారి నాటితే రెండు రకాలుగా..
120 రోజుల్లో పంట చేతికి వస్తుందని కావేరి టిల్లు విత్తనాలు కొనుగోలు చేసి నాటితే రెండు సార్లు ఈని రెండు సార్లు కంకులు వస్తున్నాయి. 120 రోజులకు కోతకు వచ్చినవి కొన్ని ఉండగా కొన్ని మరికొంత ఎత్తు పెరిగి 135 రోజులు దాటిన తరువాత కోతకు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు పంట కోయాలో తెలియడం లేదని రైతులు చెబుతున్నారు. వాస్తవానికి చాలా మంది రైతులు 120 రోజులకే పంట చేతికి వస్తే ఎక్కువ ధర ఉంటుందని సదరు వంగడం కొనుగోలు చేయగా ధరలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 120 రోజులకు పంట వచ్చి ఉంటే నాడు మిల్లుల్లో క్వింటా ఒక్కంటికి రూ.2750 ఇవ్వగా 135 రోజులకు రావడంతో ఎకరా ఒక్కంటికి 10 నుంచి 15 బస్తాలు తక్కువ రావడంతో పాటు క్వింటా ఒక్కింటికి రూ.2550 నుంచి రూ.2600 వరకే వస్తోంది.
ఈ లెక్కన రైతులకు ఏ స్థాయిలో నష్టం వాటిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక్కో ఎకరానికి రూ.17 వేల వరకు నష్టం వాటిల్లుతున్నది. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులకు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని, మెయిల్ పెట్టినా, వాట్సాప్ చేసినా రెస్పాండ్ కావట్లేదని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం వచ్చి పరిశీలించి వెళుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డిని వివరణ కోరగా వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తున్నారని త్వరలోనే సమస్య ఏంటనేది తేలుతుందని, రైతులకు న్యాయం చేసేందుకు యత్నిస్తున్నామన్నారు.
రెండు రకాల విత్తనాలు కలిసి ఉండోచ్చు
మా పొలంలోకి వెళ్లి చూస్తే అయోమయంగా ఉంది. కావేరి టిల్లు అనే విత్తనాలు కొనుగోలు చేస్తే ఒక ఎత్తులో ఒక సారి, మరికొంత ఎత్తులో మరోసారి ఈనింది. 120 రోజులకు కొంత పంట కోసేందుకు సిద్ధంగా ఉండగా మరి కొంత కోతకు సిద్ధంగా లేదు. రెండు రకాల విత్తనాలు కలిసి ఉంటాయనేది అనుమానంగా ఉంది. దిగుబడి తగ్గడంతో పాటు ధర కూడా తక్కువ రావడంతో ఎకరా ఒక్కింటికి దాదాపు రూ.17వేలు నష్టం వాటిల్లుతోంది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
-కిష్టిపాటి లింగారెడ్డి, గుడుగుంట్ల పాలెం
ఎవరూ పట్టించుకుంటలేరు..
నేను కావేరి టిల్లు విత్తనం నాటు వేస్తే తీవ్ర నష్టం వాటిల్లింది. ఎకరా ఒక్కంటికి 45 బస్తాలు వస్తాయని చెప్పారు. కానీ కోత కోస్తే 30 బస్తాలే వచ్చాయి. కంపెనీ, డీలర్లు, అధికారులు ఎరూ పట్టించుకోవడం లేదు. ఏవోకు ఫిర్యాదు చేస్తే, వచ్చి పరిశీలించి వెళ్లారే తప్ప ఎలాంటి ఫాయిదా లేదు.
– సారెడ్డి రాంరెడ్డి, పాలకవీడు మండలం