నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్16(నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్‌పై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీ వెళ్తూ ట్రిపుల్ ఆరు పనులు వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… బాధిత రైతుల వద్దకు వచ్చే సరికి మాత్రం అది అయ్యేదా… పోయేదా… అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇప్పట్లో కాని దానికి ఎందుకీ హడావుడి.. అలైన్మెంట్ మార్పు ఎందుకంటూ రైతుల ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… మంగళవారం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వెళ్లారు. అయితే చాలా సేపటి తర్వాత బయటకు వచ్చిన మంత్రిని పుట్టపాక రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడానికి ప్రయత్నించారు.
అయితే వారు ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడబోతుంటే మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పుట్టపాక రైతులు తెలిపిన వివరాల ప్రకారం… ‘సార్ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్తో మా భూములు పోతున్నాయి.’ అని వినతిపత్రం ఇవ్వగా మంత్రి దాన్ని చూడకుండానే పక్కనే ఉన్న పేఏకి ఇచ్చారు. అయితే రైతులు విషయం చెప్తుండగా… ‘అసలెందుకొచ్చారూ… మీరు ట్రిపుల్ ఆర్ వచ్చేదా… పోయేదా? వచ్చినా అది ఇప్పట్లో కాదు. ఇప్పటికీ భోనగిరి దగ్గర రాయగిరి నుంచి పోయే ఉత్తరభాగానికే అతీగతీ లేదు. ఇక మీ వైపు ఇప్పట్లో అయ్యేది కాదూ… పోయేది కాదు.
అది అయ్యే సరికి నేను ఉంటనో… నువ్వు కూడా ఉంటవో ఉండవో తెల్వదు. తరాలు మారాలేమో. ఎన్ని ప్రభుత్వాలు మారాలో కూడా తెల్వదు. మీ భూములు మీరు దున్నుకుని బతుకుపోండ్రి. ఒక వేళ భూములు పోతే నల్లగొండలో నేను బైపాస్ రోడ్డు వేస్తున్న. అక్కడ కోటి, కోటిన్నర ఇస్తున్న. అప్పటి వరకు నేనుంటే ఇక్కడ కూడా అట్లనే వస్తయి పోండ్రి’ అంటూ మంత్రి వెళ్లిపోయారు. వాస్తవంగా గత నెల 30వ తేదీన హెచ్ఎండీఏ విడుదల చేసిన ప్రాథమిక అలైన్‌మెంట్‌పై బాధిత రైతులు మరుసటి రోజు నుంచే ఆందోళనకు దిగారు.
ట్రిపుల్ ఆర్ రద్దు చేయాలని, అలైన్‌మెంట్‌ను ఇష్టారాజ్యంగా మార్చారని, పాత అలైన్‌మెంట్‌ను అమలు చేయాలని, మార్కెటు రేటు ప్రకారం పరిహారం చెల్లించాలంటూ రకరకాల డిమాండ్లతో రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. అయితే ఈ విషయంలో దక్షిణ భాగం రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రావడంలేదు.
కలిసి విన్నవిద్దామని ఈ నెల 13న నల్లగొండకు వచ్చిన మంత్రి వద్దకు తేరటుపల్లి గ్రామ రైతుల వస్తే వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. మంగళవారం కూడా ముందు విషయం బయటకు తెలిస్తే అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో పుట్టపాక రైతులు గుట్టుచప్పుడు కాకుండా మినిస్టర్స్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మంత్రి బయటకు వచ్చే వరకు వేచి చూసి బయటకు రాగానే విషయం చెప్పబోతే మంత్రి మధ్యలో కల్పించుకొని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పట్లో కానిదానికి ఇంత హడావిడి ఎందుకు..
మంత్రి చేసిన వ్యాఖ్యలు ట్రిపుల్ ఆర్ బాధితుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇదే నిజమైతే… ఇప్పట్లో కానీ ట్రిపుల్ ఆర్ కోసం అలైన్మెంట్ మార్పు ప్రకటన, ఇంత రాద్ధాంతం దేనికని రైతులు ప్రశ్నిస్తున్నారు. సారవంతమైన భూముల్లో ఏండ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ జీవితాల్లో కల్లోలం రేపడం ఎందుకుంటున్నారు. అలైన్మెంట్ ప్రకటన వచ్చిన నాటి నుంచీ కంటినిండా నిద్రలేదని, కడుపు నిండా తిండి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం సీఎం పక్కన కూర్చుని ట్రిపుల్ ఆర్ త్వరలో పూర్తి… పనులు వేగవంతం చేస్తామంటూ ప్రకటనలు చేసే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలా యూటర్న్ ప్రకటనలు చేయడం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. నిత్యం సీఎం పక్కనే కూర్చుని ట్రిపుల్ ఆర్ పనలు త్వరలో పూర్తి చేస్తాం.. వేగవంతం చేస్తాం.. అంటూ ప్రకటనలు చేసే మంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అలైన్మెంట్ మార్చాల్సిందే!
సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్16 : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూములు కోల్పోతున్న రైతులు మండలంలోని చిమిర్యాల గ్రామం వద్ద నారాయణపురం చౌటుప్పల్ రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ భూముల మీదుగా వెళ్తున్న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాస్తారోకో చేస్తున్న రైతులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో భూములు కోల్పోతున్న రైతులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.