పెన్పహాడ్, సెప్టెంబర్ 03 : వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకుని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం సహకార సంఘం కార్యాలయం వద్ద వందల మంది రైతన్నలు గంటల కొద్దీ నిరీక్షించారు. సొసైటీకి 150 బస్తాల యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో గంటల కొద్దీ నిలబడ్డారు. తీరా సర్వర్ బిజీ అంటూ సాకు చెప్పి అధికారులు అక్కడి నుంచి తపించుకున్నారు.
ప్రభుత్వం తమకు సరిపడా యూరియాను అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాట్లు వేసి నెలలు కావస్తున్నా యూరియా దొరక్క పోవడంతో సాగు చేసిన పంట ఎదుగుదలకు రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలపై స్పందించాలని కోరారు.