అర్వపల్లి, మే 28 : నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ, అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో NH 365 జాతీయ రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు. అర్వపల్లి మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నెల రోజులు దాటినా కాంటాలు వేయకపోవడంతో పాటు ట్యాబ్లో ఎంట్రీ చేయకపోవడంతో అకౌంట్లో డబ్బులు జమ కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చావే శరణ్యమంటూ చింతల సైదమ్మ అనే మహిళా రైతు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగింది. అలాగే ఒక బస్తాకు మూడు కేజీలు కట్ చేస్తున్నారని తెలిపారు.
ఈ కేంద్రంలో ఇంకా నాలుగు లారీలకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసి ముద్దయింది. బస్తాల నుండి మొలకలు బయటకోస్తున్నాయి. అధికారులకు ఫోన్ చేస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ రైతులు వాపోతున్నారు. దాదాపు 2 గంటల పాటు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించడంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో రైతులు కాటబత్తిని లక్ష్మీనర్సు, గోసుల విజయ్ కుమార్, సండ్ర యాదయ్య, లింగయ్య, అంకిరెడ్డి రాజారాములు, యాదగిరి, శాగంటి నాగరాజు, ఉప్పలయ్య, వీరాంజనేయులు, అంతయ్య, అయోధ్య, మల్లేశ్, అంజయ్య, సులోచన, నర్సయ్య, యాదగిరి పాల్గొన్నారు.
Arvapally : మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతన్న
Arvapally : మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతన్న