తిరుమలగిరి మే 14 : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మార్కెట్లో క్రయ విక్రయాలకు, ఎగుమతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మంగళవారం నుంచి వ్యాపారులు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ను బంద్ చేశారు. ఈ మార్కెట్‌కు నిత్యం వివిధ రకాల పంటలకు సంబంధించిన ధాన్యం వందల క్వింటాళ్లలో వస్తుంటాయి. దీంతో ఆన్నదాతలు తమ పంటలు అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడాల్సివస్తోంది.
ఇబ్బంది పడుతున్న రైతులు
వ్యవసాయ మార్కెట్‌కు ఇప్పటి వరకు 1,60,000 క్వింటాళ్ల వరి ధాన్యంతో పాటు సుమారు 6 వేలకు పైగా మక్క బస్తాలు వచ్చాయి. వీటితో పాటు వివిధ రకాల పంటలు రైతులు విక్రయిస్తుంటారు. రోజుకు 20 వేల క్విటాల వరకు వరి ధాన్యం వస్తుంటుంది. వరి ఇతర పంటలు, మక్క కొనుగోలు కేంద్రం ఉండటంతో కాంటాలు వేసి లారీల్లో తరలించటం ఇబ్బందిగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 13 లక్షల బస్తాల ధాన్యం మార్కెట్‌కు వస్తుంటుంది.
మక్క కొనుగోళ్లలో జాప్యం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కాంటాలు కాక, లారీలు లేక ఇబ్బందులు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధాన్యం కోసం అధికమొత్తంలో లారీలు పెడుతుండటంతో మొక్క జొన్న తరలింపులో లారీల కొరత ఎదురవుతోంది . దీనితో మక్క రైతులు 15-20 రోజుల వరకు పడిగాపులు పడాల్సి వస్తోంది.
మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఒక్క వ్యవసాయ మార్కెట్లోనే ఏర్పాటు చేయటం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీంతో దూరప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పంట నమోదు ఏదీ..
గ్రామాల్లో రైతులు వరి, పత్తి, కంది లాంటి పంటలను మాత్రమే పంట నమోదు చేయించుకున్నారు. మక్క రైతులు నేరుగా వ్యవసాయ మార్కెట్లో తమ పంటను విక్రయించుకునే వారు . వ్యవసాయ మార్కెట్లో మార్క్ ఫెడ్ ఏర్పాటు చేయటం వల్ల పంట నమోదు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో కాకుండా మరో ప్రాంతంలో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆన్లైన్ నమోదు తప్పనిసరి
మక్క రైతులను ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఇబ్బందులు పెడుతోంది. మొదట మక్క పంట ఆన్లైన్ నమోదు చేసుకుంటే టోకెన్ ఇస్తున్నారు. టోకెన్ తీసుకోక ముందే ఫార్మర్ రిజిస్టర్‌తో వేలిముద్ర వేయించుకోవాలి. కాంటాలు పూర్తయిన తర్వాత విక్రయించిన రైతు మాత్రమే రెండోసారి వేలి ముద్రవేయాలి. అప్పుడే లారీల్లో ఎగుమతి ప్రారంభిస్తారు.
మక్కలు తెచ్చి 15 రోజులైంది..
15 రోజుల క్రితం రెండెకరాల మక్క పంటను ఆన్లైన్లో నమోదు చేయించా. అధికారులు మాత్రం 60 గుంటలకు మాత్రమే నమోదు చేసి 95 బస్తాలకు మాత్రమే కొనుగోలు కేంద్రంలో విక్రయానికి అనుమతి ఉంది, మిగిలినవి బయట అమ్ముకోవాలని ఇబ్బంది పెడుతున్నారు. మళ్లీ అర ఎకరం పంట బయట అమ్ముకుంటే 1600 వందలకు ఎక్కువ ధర పెట్టరు. ఏంచేయాలో అర్థం కావటం లేదు. అధికారులు మొత్తం పంట అమ్మాలంటే అర ఎకరానికి మళ్లీ వేరే పాసు పుస్తకం ద్వారా ఆన్లైన్ చేయాలని చెబుతున్నారు. 15 రోజుల నుంచి రాత్రి పగలు ఇక్కడే పడిగాపులు పడుతున్నా.
-లకావత్ తుల్సా, మక్క రైతు, గుండెపురి, తిరుమలగిరి