యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందని, అసలు అలైన్మెంట్ మార్చే దమ్ముందా.. లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నాడు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని, ఇప్పుడు పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు.
భువనగిరి మండలంలోని అనంతారంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలగిరిలో సంపూర్ణ రైతు రుణ మాఫీ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్నప్పుడు అడ్డుకొని.. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి పర్యటించడంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ నేతలు ఆలయ మాఢ వీధులను శుద్ధి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.
రైతు రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చింతల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సర్కారు మెడలు వంచి రైతులకు రూ. రెండు లక్షలు మాఫీ చేసే వరకూ బీఆర్ఎస్ కొట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. రైతు పెట్టుబడికి రైతుబంధు రాక, వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ లేక, పంటకు రూ. 500 బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుబంధు, రుణమాఫీ చేయాలని రైతులు అడుగుతుంటే.. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ప్రజలను పకదోవ పట్టించాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేసిందని, నిండుకుండలా ఉన్న కాళేశ్వరం ఇప్పుడు కుంగిపోలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఒక ఎజెండా, అభివృద్ధి లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కుతాడి సురేశ్, వల్లపు విజయ్, దండమైన బాలరాజ్, గాజుల నవీన్, కావడి నవీన్, శ్రీశైలం, కట్టుకురి నరేశ్, నగరం నరేశ్, మోతె మనోహర్ తదితరులు పాల్గొన్నారు.