వలిగొండ, మే 21: ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను అనాథలుగా వదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలో రైతులు.. బీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో మొగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ..నెలా పదిహేను రోజులుగా రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించినా కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను అరిగోస పెడుతున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాలకు లారీలు వస్తలేవని, గోడౌన్లు అందుబాటులో లేక ధాన్యం దిగుమతి చేసుకుంటలేమని మిల్లర్లు కుంటిసాకులు చెపుతున్నారన్నారు. బస్తాకు 42 కేజీల తూకం వేసి..తరుగు పేరుతో కోతలు పెడుతున్నారని, మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 20శాతం ధాన్యం కొనుగోలు కాలేదని, ప్రభుత్వం చేతగాని తనంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుకిరువైపులా కిలోమీటర్లమేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తాసీల్దార్ దశరథ, ఎస్సై యుగంధర్ వచ్చి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, సుర్కంటి వెంకట్రెడ్డి, టేకుల సోమారం సర్పంచ్ పనుమటి మమతానరేందర్రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.