మర్రిగూడ/నాంపల్లి,ఎప్రిల్ 21: మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాలకు రెండు వారాల కిందటే ధాన్యం తెచ్చినా అధికారులు కొనుగోళ్లు చేపట్టడంలో విఫలమయ్యారు. తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టిన అధికారులే తడిసిన ధాన్యానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గాలి వానకు ధాన్యం కొట్టుకు పోయింది. తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకోలేక వర్షంలో రైతులు నానా తంటాలు పడ్డారు. కొనుగోలు కేంద్రానికి సకాలంలో వడ్లు తెచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం, తరుగు పేరుతో అధికారులు జాప్యం చేయడం వల్లే అకాల వర్షం కురిసి, నష్టపోవాల్సి వచ్చిందన్నారు. మ్యాచర్తో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడటంతో రైతులు దిగులు పడుతున్నారు. అధికారులు ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని కోరుతున్నారు.
అకాల వర్షం.. రైతులకు నష్టం..!
మండలంలో సాయంత్రం కురిసిన అకాల వర్షంతో..రైతులు అష్టకష్టాలు పడ్డారు. వర్షంతో పోలేపల్లి స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ధాన్యం తెచ్చి వారం రోజు లు గడుస్తున్నా మ్యాచర్ పేరుతో కాలయాపన చేస్తున్నారని వా పోతున్నారు. ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ స్తున్నారు.