సూర్యాపేట, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : కొర్రీల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఫలితం క్షేత్రస్థాయిలో రైతులకు దక్కేలా కనిపించడం లేదు. రైతులు చేతికి వచ్చిన పంటను మిషన్లతో కోసి ఆరబెట్టకుండా పచ్చి వడ్లనే మిల్లులకు తరలిస్తుండడంతో ప్రభుత్వం పెట్టే నిబంధనలకు అనుగుణంగా బోనస్ దక్కే చాన్సే లేదు. 14శాతం తేమ ఉంటేనే ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. కోసిన వెంటనే వడ్లు తీసుకువస్తే 25 నుంచి 30 శాతం వరకు తేమ ఉంటుండడంతో కొనుగోలు చేయని పరిస్థితి.
మరోవైపు సన్న రకం ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే సన్నాలకు ధర అధికంగా పలుకుతున్నది. పచ్చి వడ్లను కొనుగోలు చేసిన మిల్లులు వాటిని స్టీమ్ చేసి డ్రై చేసి స్టోర్ చేయడంతో వారికి కూడా నష్టం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పటికే రైతులు, పంటల వివరాలు, బ్యాంక్ అకౌంట్ల సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నందున మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రం, లేదా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తే సన్నాలు పండించిన రైతులకు బోనస్ దక్కుతుంది తప్ప కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తేనే బోనస్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడమే అవుతుందని రైతులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ అంటూ చేసిన వాగ్దానం ద్వారా రైతులను మరోసారి మోసం చేస్తుందనే అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకపోగా, రుణమాఫీ కూడా అందరికీ చేయలేదు. దీనికి తోడు సాగునీటి నిర్వహణ లోపభూఇష్టంగా ఉండడంతో జిల్లాలో వందల ఎకరాల్లో పంట మునిగింది. వేలాది ఎకరాల్లో ఎండిపోయింది. ఇన్ని రకాలుగా నష్టపోతున్న రైతాంగానికి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్లో సన్న వడ్లు పండిస్తున్న రైతులకు కింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామనడం మోసమేనని స్పష్టమవుతున్నది.
కొద్ది సంవత్సరాల నుంచి చూస్తే… జిల్లాలో సన్న వడ్లు పండించే రైతులు తమ ధాన్యాన్ని ఏనాడూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించిన దాఖలాలు లేవు. సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువ ఉంటుండడంతో ధాన్యానికి కూడా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే అధికంగానే పలుకుతున్నది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కింటాకు రూ.2,320 ఉండగా, గత సీజన్లో సన్నాలను కోసి పచ్చి వడ్లను వ్యవసాయ మార్కెట్కు తీసుకువెళ్లినా, మిల్లుల్లో విక్రయించుకున్నా వ్యాపారులు కింటాకు రూ.2,500 నుంచి 3,200 వరకు ధర పెట్టారు. అందుకే సన్న వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి ప్రయోజనం ఉండదని రైతులు చెబుతున్నారు. గతంలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోనే సన్న రకాలను ఎక్కువ పండించగా.. పచ్చి వడ్లకు సైతం ధర అధిక ధర వస్తుండడంతో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ సన్నాల సాగు విపరీతంగా పెరిగింది. నేడు జిల్లాలో 4,72,000 ఎకరాల్లో వరి సాగు కాగా.. ఇందులో 3,79,000 ఎకరాల్లో సన్న రకాలే వేశారు. దొడ్డు రకం సాగు 93 వేల ఎకరాల్లో మాత్రమే ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా రూ.500 బోనస్ ఇచ్చేందుకు సన్నాల కోసం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను సిద్ధం చేస్తున్నది. దాంతో రైతులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కేవలం మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు, లేదా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే బోనస్ దక్కతుంది. కొద్ది సంవత్సరాలుగా పరిశీలిస్తే సన్నాలకు బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కంటే దాదాపు రూ.500 నుంచి 800 వరకు ఎక్కువ పలుకుతున్నది. అంతేగాక కోత మిషన్లతో పొలంలోనే బోరేల్లో నింపి తీసుకువెళ్తుండగా, ధాన్యంలో తేమ శాతం దాదాపు 25 నుంచి 30 వరకు ఉంటున్నది.
ఒకవేళ వాటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లినా తేమ శాతం 14 వచ్చే వరకు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇలా ఆరబెట్టడం ద్వారా కింటాకు 7 కిలోల వరకు తగ్గుతుంది. అలా రైతులు కింటాకు రూ.250 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఐదారు రోజుల సమయం కూడా పడుతుంది. ఇంతా చేస్తే రైతుకు అక్కడ ఇచ్చేది కింటా మద్దతు ధర 2,320 రూపాయలే. ఆరబెట్టిన నష్టం పోనూ 2,070 దక్కుతుండగా, ప్రభుత్వం రూ.500 బోనస్ కలిపితే రూ.2,570 దక్కుతుంది. అలా కాకుండా ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ మిల్లుల వద్ద కూడా ఇస్తే తరుగు ఉండకపోగా క్వింటాకు రూ.2,800 వరకు ధర పలుకుతుండగా, బోనస్ 500 కలుపుకొని రైతుకు మేలు జరుగుతుంది.
ప్రస్తుతం ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మిల్లుల వద్ద విక్రయించిన ధాన్యానికి అక్కడి ప్రభుత్వం రైతుల అకౌంట్లలో బోనస్ వేస్తున్నది. సన్నవడ్లు పండించే రైతులు దాదాపు 99శాతం మంది మిల్లులకే విక్రయిస్తుండగా అక్కడే కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ వద్ద ప్రతి రైతుకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు, క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతుకు ఉన్న భూమి, ఎన్ని ఎకరాల్లో ఎలాంటి పంట వేశారు అనేది రికార్డు ఉన్నందున బోనస్ రూ.500 మిల్లుల వద్ద కూడా ఇస్తే ఎలాంటి అవకతవకలకు కూడా తావు ఉండదని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. నిజంగా రైతాంగానికి బోనస్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే మిల్లుల వద్ద విక్రయించుకున్నా ఇవ్వాలని అన్నదాతలు అంటున్నారు.
ఐకేపీ కేంద్రాలకు తీసుకువెళ్లిన సన్నరకం ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనడం సరికాదు. సాగర్ కాల్వ కింద వ్యవసాయం చేసి సన్న ధాన్యం పండించే రైతులందరూ కూడా కోత మిషన్లతోనే పొలం కోయిస్తారు. పచ్చి వడ్లనే నేరుగా ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తారు. ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకు కంటే కూడా బాగానే ధర దక్కుతుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుంటే వడ్లు ఆరబెట్టాల్సి ఉంటుంది. దాంతో తూకం తగ్గుతుంది. అలాంటప్పుడు రైతులకు ఏంటి ప్రయోజనం. రైస్ మిల్లుల రైతులు విక్రయించే ధాన్యానికి రూ.500బోనస్ ఇస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
-చామకూరి అంజి, రైతు, పొనుగోడు గ్రామం, గరిడేపల్లి మండలం