‘ఏ కుటుంబానికి అయితే 2లక్షల రూపాయలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2లక్షలు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబాల రుణఖాతాలకు బదిలీ చేయడం జరుగుతుంది’.. రుణమాఫీ మార్గదర్శకాల్లో రేవంత్‌రెడ్డి సర్కారు పొందుపర్చిన విషయమిది.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) :
కానీ, ఇప్పుడు జరుగుతుందేంటి? అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన ప్రకటన ఏంటి? ‘రైతులకు 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. రూ.2లక్షలకుపైగా ఉన్నవాటిపై రుణమాఫీ నిర్ణయం లేదు. 2లక్షల లోపు రుణాలున్న రైతులకు ఇప్పటికే 20,615 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం’ అంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఇదే విషయమై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులందరి రుణమాఫీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అందరికీ అని, ఆ తర్వాత రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒక్కరికే అని, అందులోనూ సాంకేతిక కారణాలతో రూ.2లక్షల లోపు రుణాలున్న రైతులను పక్కన పెట్టి అరకొరగా రుణమాఫీ చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు విడుతల్లో కలిపి 3.85లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగినట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇంకా 1.75లక్షల మంది రుణమాఫీకి కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తునే ఉన్నారు. గతేడాది ఆగస్టు 15న రెండు లక్షల రుణమాపీ ప్రకటన చేసిన ప్రభుత్వం 17వ తేదీన తొలి విడుత ప్రకటించింది. తరవాత చివరగా నవంబర్ 30న నాలుగో విడుతగా రేషన్ కార్డులు లేని వారిలో అర్హులైన వారి జాబితాను కొద్దిమందితో ప్రకటించింది. అప్పటి నుంచి నేటి వరకూ మిగతా రుణమాఫీ కాని రైతులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు.
అయితే ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు లక్ష మంది రైతులు రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారు ఉన్నట్లు అంచనా. వారిలో సగం మంది వరకు ప్రారంభంలో ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లుగా రెండు లక్షలకు పైగా ఉన్న రుణాన్ని బ్యాంకులకు చెల్లించారు. ఇక అప్పటి నుంచి నేటి వరకు తమకు 2లక్షలు రుణమాఫీ అవుతుందని నిరీక్షిస్తూనే ఉన్నారు. అదనంగా ఉన్న రుణం చెల్లించడం కోసం మళ్లీ బయట ప్రైవేట్ అప్పులు చేసిన వారే ఎక్కువ మంది కావడం గమనార్హం. ఆ డబ్బులకు సంబంధించిన వడ్డీ కూడా రైతులకు భారంగా మారింది.
ఇలాంటి రైతులంతా తమకు కూడా రుణమాఫీ కాకపోతుందా, ప్రభుత్వం ప్రకటించాక వెనుకో, ముందో రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ వారందరి ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఇన్నాళ్లు వేచి చూసేలా చేసి తీరా ఇలాంటి మోసపూరిత ప్రకటన చేయడం ఎంతవరకు సబబని రైతుల ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విషయాల్లో మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా విషయంలో, బోనస్ చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే మాట తప్పి దగా చేసిందని, రుణమాఫీలోనూ అదే తరహా మోసానికి తెరలేపడం దుర్మార్గమని రైతులు భగ్గుమంటున్నారు. ఇక 2లక్షల లోపు రుణాలు ఉన్న రైతుల్లో సైతం 75 వేల మంది వరకు రుణమాఫీ కానట్లు అంచనా.
వీరిలో చాలామందికి ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పు పడడం వంటి సాంకేతిక సాకులు చూపి మాఫీ చేయలేదు. ఇలాంటి వారికి సంబంధించి కూడా రుణమాఫీ లేనట్లేనని అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనతో తేటతెల్లమైంది. మొత్తంగా ఎంత వీలైతే అంతగా రుణమాఫీని ఎగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి కుట్రలు చేస్తుందన్న విమర్శలకు మంత్రి తాజా ప్రకటన బలమైన ఆధారంగా నిలుస్తున్నది.
పోచంపల్లి కెనరా బ్యాంకులో వ్యవసాయ అవసరాల కోసం మా కుటుంబంలో ఇద్దరం రూ.3లక్షల లోన్ తీసుకున్నాం. ప్రభుత్వం రూ.2లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేస్తుందని ప్రకటించడంతో పాతిక వేలు అప్పు తెచ్చి వడ్డీ మొత్తం కట్టిన. డబ్బులు కట్టినట్టు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కూడా చూపించా. ఫొటో కూడా తీసుకున్నరు. కానీ ఇప్పటి వరకు అసలు రుణం మాఫీ కాలేదు. గవర్నమెంటేమో అందరికీ మాఫీ చేసినం అంటుంది. నాకైతే ఇప్పటిదాకా కాలేదు. రుణమాఫీ ఎప్పుడైతదా అని ఏఓ ఆఫీసు, బ్యాంకు చుట్టూ తిరుగుతనే ఉన్నా.
– మేకల చొకారెడ్డి, రైతు, శివారెడ్డిగూడెం, భూదాన్‌పోచంపల్లి మండలం
నాకు అరెకరం పొలం ఉంది. అదే మాకు జీవనాధారం. వ్యవసాయ అవసరాల కోసం మిర్యాలగూడలోని ఎస్బీఐలో 11వేలు లోన్ తీసుకున్నా. వడ్డీతో కలిపి మొత్తం రూ.25వేలు అయ్యింది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలిసి బ్యాంకుకు వెళ్లి అడితే.. 4వేల రూపాయలే రుణమాఫీ అయ్యింది చెప్పారు. నేనే బ్యాంకుకు రూ.21వేలు తిరిగి చెల్లించాలని చెప్పడంతో ఏం చేయాల్నో పాలుపోలేదు. వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారులను బతిమిలాడినా మా చేతిలో లేదంటున్నారు. రెండు రూపాయల లోపు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం పాతిక వేలు కూడా చెయ్యకపోతే నాలాంటి చిన్న రైతులు ఏంకావాలి.
– సిరసనగండ్ల రామకృష్ణాచారి, రైతు, దిలావర్పూర్, దామరచర్ల మండలం
పోచంపల్లి కెనరా బ్యాంకులో నాకు రూ. 92వేలు రుణం ఉంది. రుణమాఫీ జాబితా లిస్టులో నా పేరు వచ్చింది. జనవరి 6న రెన్యూవల్ చేసుకున్నా. అకౌంట్ నంబర్ మారినందుకు నాకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. వ్యవసాయాధికారులను అడిగితే తెలియదంటున్నారు. నాకు ఇంతవరకు ఒక్క పైసా కూడా రుణమాఫీ కాలే.
– మంచాల నరసింహ, రామలింగంపల్లి గ్రామం, భూదాన్‌పోచంపల్లి మండలం
నేను బ్యాంకులో రెండున్న లక్షలు వ్యవసాయ రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మి అసలు, వడ్డీ కట్టలేదు. మిత్తితోని కలిపి 3లక్షల 75 వేలు అయ్యింది. రూ.2 లక్షలపైనే ఉన్న డబ్బు చెల్లిస్తే మాఫీ అవుతుందని ఐదు నెలల కింద రూ.1.75లక్షలు బ్యాంకులో కట్టిన. అయినా మిగిలిన రూ.2 లక్షలు రుణమాఫీ మాత్రం కాలేదు. బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన.
– చింతకాయల లింగమ్మ, రైతు, త్రిపురారం
నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. గడ్డిపల్లిలోని ఎస్బీఐలో లక్షా 10 వేలు లోన్ తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలియడంతో ఆశగా బ్యాంకు వెళ్తే నిరాశే ఎదురైంది. ఆధార్ కార్డు వేరే బ్యాంకుతో లింకై ఉందని సాకు చూపి ఇంతవరకూ రుణమాఫీ చెయ్యలేదు. ప్రభుత్వం స్పందించి నాకు రుణమాఫీ చేయాలి.
– మచ్చ కృష్ణ, పొనుగోడు, గరిడేపల్లి మండలం