మిర్యాలగూడ,వేములపల్లి, ఏప్రిల్ 7: యాసంగి పంట పండించిన రైతుల ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సోమవారం రాత్రి మిల్లర్లతో రైతులు ఘర్షణకు దిగారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ పరిధిలో ఉన్న రైసు మిల్లుల వద్దకు గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్ల ద్వారా తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకెళ్లారు. కొంత మంది మిల్లర్లు తక్కువ ధర చెప్పడంతో ‘మీ మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యాన్ని పీలుస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నాం., మేం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరా..’ అంటూ వ్యాపారులతో రైతులు ఘర్షణకు దిగారు.
ఇందుకు నిరసనగా మిల్లర్లు మూకుమ్మడిగా మంగళవారం ఉదయం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై, అవంతీపురం, యాద్గార్పల్లి రహదారులపై వేలాదిగా ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు శెట్టిపాలెం గ్రామ సమీపంలో రైసు మిల్లుల వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ధర్నాకు దిగారు. గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి, పలు సూచనలు చేశారు. రైతులతో మిల్లు గుమస్తాలు, వ్యాపారులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. మద్దతు ధర తగ్గకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. వ్యాపారులు ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతో రైతులు ధర్నా విరమించారు. కాగా మంగళవారం ఒక రోజే ఆరు వేలకు పైగా ట్రాక్టర్లలో ధాన్యం తరలివచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద, అదేవిధంగా నాన్ ఆయకట్టు ప్రాంతంలో కూడా కోతలు ముమ్మరం కావడంతో రెండు రోజులుగా ధాన్యం ట్రాక్టర్లు భారీగా తరలి వస్తున్నాయి. వ్యాపారులు 4 గంటల పాటు కొనుగోళ్లు నిలిపివేయడంతో వేలాది ట్రాక్టర్లు రోడ్లపై నిలిచిపోయాయి. మిల్లర్లతో చర్చల అనంతరం వెంటనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.