హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : దైవం కంటే గురువుకే పెద్ద పీట వేసిన సంస్కృతి మనది. అక్షర జ్ఞానాన్ని విద్యార్థి మనసులో నింపే గురువుకు సమాజంలో చక్కటి గౌరవం దక్కుతుంది. విద్యార్థికి మంచి నడవడిక, విచక్షణను నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచి, సహనం, క్రమశిక్షణతో మెలిగే గురువు దైవంతో సమానమని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి గురువులెందరో మన మధ్యలో ఉన్నారు. అయితే దైవంలా కొలిచే గురువులే కాదు.. వృత్తికి కళంకం తెస్తున్న టీచర్లు కూడా మన దగ్గర కొందరున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు సానబెట్టాల్సిన వారు.. బంగారు భవితకు మార్గం వేయాల్సిన గురుతరమైన బాధ్యత గల కొందరు పంతుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు.
ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న కీచక గురువుల వ్యవహారాలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. టీచర్ వృత్తికి మాయని మచ్చని తెచ్చిపెడుతున్నాయి. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వయస్సు విచక్షణ మరచి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. అభంశుభం తెలియని విద్యార్థులపై లైంగికదాడులకు దిగుతున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేస్తున్నారు. సహచర టీచర్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు, పిల్లలపై లైంగిక దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. టీచర్ల కీచులాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. పొరపొచ్చాలు.. అభిప్రాయబేధాలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విద్య.. విలువలు. క్రమశిక్షణకు విద్యాలయాలు నిలయాలు. మిగతా ఉద్యోగాలు బతుకును, బ్రతుకుదెరువును మాత్రమే చూపిస్తాయి. కానీ మానవ వనరులు, దేశ ప్రగతి సౌధానికి పునాదులను నిర్మించే గౌరవప్రదమైన వృత్తి ఒక్కటీచర్ మాత్రమే. ఇలాంటి పవిత్ర వృత్తిలోని కొందరు టీచర్ల ప్రవర్తనలు శృతి మించిపోతున్నాయి.. అమానవీయ .. అనాగరిక.. దుశ్శాసన పర్వాలు తరగతి గదుల్లోనే జరుగుతున్నాయి. పల్లెల నుంచి పట్నం వరకు ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడాల్లేకుండా ఇలాంటిని జరుగుతున్నాయి. బడులు, కాలేజీల్లో అనేక చోట్ల కీచక పర్వాలు వెలుగుచూస్తున్నాయి.
విద్య.. విజ్ఞానం నేర్పాల్సిన టీచర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు అమ్మాయిలకు అసభ్యకరమైన మెసెజ్‌లు పంపిస్తున్నారు. ఆశ్లీల చిత్రాలు చూపిస్తున్నారు. తాకరాని చోట తాకుతున్నారు. ఇటీవలీ కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తుండటంతో పాఠశాలల్లో పిల్లల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చిన్నారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోనే కుమిలిపోతున్నారు. కొందరు టీచర్ల వ్యవహారం శృతి మించడంతో తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన దాఖలాలున్నాయి. కొందరిని సస్పెండ్ చేసిన ఉదంతాలున్నాయి. పిల్లలకు లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం అమల్లో ఉంది. కఠినమైన ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా టీచర్లల్లో మార్పు రావడం లేదు. తెలంగాణలో రోజుకు సగటున ఐదారు పోక్సో కేసులు నమోదవుతున్నాయి. జాతీయ సగటు కంటే అధికంగా పోక్సో కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలోని కొందరు టీచర్ల వ్యవహారం అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. పిల్లలకు మార్గదర్శకుల్లా ఉండాల్సిన వారు దారి తప్పుతున్నారు. కొందరు ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు. కొందరు టీచర్లు దిగజారి అక్రమ సంబంధాలు నెరపుతున్నారు. ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్ల వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. మహిళా టీచర్ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం సంచలనం సృష్టించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ మహిళా టీచర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. దీనికి కారణం అక్రమ సంబంధమే. మేడ్చల్ జిల్లా పోచారంలో ఓ ప్రైవేట్ టీచర్ ఏకంగా విద్యార్థికి తాళి కట్టేశాడు. హైదరాబాద్ చందానగర్‌లో ఓ మహిళా టీచర్ ఏకంగా పదో తరగతి విద్యార్థితో ప్రేమాయాణం నడపడమే కాకుండా ఏకంగా జంప్ అయ్యారు.
పిల్లలపై లైంగికదాడులు ఘటనలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొద్ది మంది తప్పిదాలతో ఉపాధ్యాయ వృత్తి, ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరి ప్రవర్తన అంకితభావంతో పనిచేస్తున్న లక్షలాది మందిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. నిజాయితీగా సేవలందిస్తున్న వారు కలత చెందాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 13 : విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఉర్దూ ఒప్పంద ఉపాధ్యాయుడు సయ్యద్ ఇమ్రాన్ తన రూమ్‌కు పిలుచుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా ప్రిన్సిపాల్ ఆనంద్‌బాబు ప్రాథమిక విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించగా పరిశీలించిన వారు ఒప్పంద ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు.