భువనగిరి అర్బన్ ఆగస్టు 13 : భువనగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆటలాడుకుంటున్న విద్యార్థులపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో అలీమా(8) అనే మూడో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని బగాయత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆటలాడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వేప చెట్టు కొమ్మ విరిగిపడి పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు, గాయపడిన విద్యార్థులను భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు నలుగురు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన దావుద్ అలీ, అమీనాల కూతురు అలీమా(8) మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థులకు కాళ్లు విరిగాయని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
భువనగిరి బగాయత్ పాఠశాల ఆవరణ తాగుబోతులకు అడ్డాగా మారింది. ఇక్కడి ప్రాథమిక పాఠశాల, హైసూల్, జిల్లా గ్రంథాలయం అన్నీ ఒకే ఆవరణలో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పోలీసు పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించకపోవడంతో ఈ ఆవరణ తాగుబోతులకు అడ్డాగా మారింది. వారం రోజుల క్రితం కొందరులు తాగుబోతులు ఒక వేప చెట్టును తగులబెట్టినట్లు సమాచారం. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో వచ్చి మంటలు ఆర్పారు. వేపచెట్టు కాలిపోవడంతో తొర్ర ఏర్పడి, పటుత్వం తప్పి కూలిపోయినట్టు తెలుస్తోంది.
పాఠశాలలో విద్యార్థిని మృతికి ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈనెల 5న పాఠశాలలోని వేప చెట్టుకు ఎవరో నిప్పంటించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారన్నారు. ఈ క్రమంలో అధికారులు చెట్టు, కాలిన కొమ్మలను తొలగించకుండా అలాగే ఉంచారన్నారు. దీంతో చెట్టు కొమ్మ విరిగి ఆటలాడుకుంటున్న విద్యార్థులపై పడిందన్నారు. దీంతో ఒక విద్యార్థిని మృతి చెందిందన్నారు. అలాగే మరో ఇద్దరు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును, కాలిన కొమ్మలను తొలగించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని, ఇందుకు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలన్నారు. విద్యార్థిని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న మూడో తరగతి విద్యార్థిని అలీమా మృతి చెందడం బాధాకరమని, అలీమ కుటుంబానికి, ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని బాలల హకుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.