– బాధలు చెప్పుకుందామని వచ్చిన త్రిబుల్ ఆర్ బాధితులు
– అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
– నల్లగొండ గడియారం సెంటర్లో బాధితుల ఆందోళన
నీలగిరి, సెప్టెంబర్ 13 : ఎవనికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతుల పరిస్థితి. రైతు రుణ మాఫీ మొదలుకొని, పంటకు పెట్టుబడి సాయం, సన్నాలకు బోనస్, కౌలు రైతులకు సాయం, పంటలకు గిట్టుబాటు ధరలు, పంట నష్ట పరిహాలు, చెరువులు, కుంటలు నింపి ఆయకట్టు చివరి భూములకు నీరందించలేకపోవడం, లిఫ్ట్‌లకు మరమ్మతుల లేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా లిస్ట్. ప్రస్తుతం యూరియా కోసం పొద్దనకా, మాపనక రైతులు పడుతున్న నానా అవస్థలు అందరి కండ్లముందున్నవే. తాజాగా ఇదే కోవలోకి చేరారు రీజినల్ రింగ్ రోడ్డు భూ బాధిత రైతులు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వల్ల తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విన్నవించుకుందామని గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి హెచ్ఎండీఏ వెబ్సైట్లో దక్షిణ భాగం అలైన్మెంట్ విడుదల చేసి ఈ నెల 15వ తేదిలోగా అభ్యంతరాలను తెలిపాలని కోరుతూ ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. దీంతో బాధిత రైతులు నల్లగొండ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డిని కలిసేందుకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల ఇందిరా భవన్ వద్ద మంత్రిని కలిసి మెమెరాండం ఇచ్చి వెళ్దామని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలిపిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదని, మంత్రికి వినతి అందజేసి వెళ్లిపోతామని ఎంత బ్రతిమాలినా వినకుండా పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో పడేశారు.ఈ క్రమంలో బాధితులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
రైతులను అరెస్ట్ చేసి నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి పర్యటన ముగిసిన అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మొదటి అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు నిర్మాణం చేయాలని, రెండో అలైన్మెంట్ ప్రకటించిన విధంగా చేయొద్దని మంత్రిని కలిసి వేడుకుందామని వస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. గ్రామంలో అంతా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఎకరం నుండి 5 ఎకరాల లోపు ఉన్నవారి భూములు మొత్తంగా పోతున్నాయి. దీంతో వారు జీవనాధారం కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా 210 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం చేస్తే పంట భూములు కోల్పోకుండా ఉంటుందని చెప్పడం కోసం వచ్చినట్లు తెలిపారు. అలాగే పరిహారం ఎకరాకు కేవలం రూ.10 లక్షల లోపు ఇస్తున్నారని, అక్కడ బహిరంగ మార్కెట్ విలువ రూ.80 లక్షల నుండి కోటి రుపాయల వరకు ఉందన్నారు. ప్రభుత్వ పరిహారంతో మరోచోట భూములు కొనే వీలులేదని, ఉన్న జీవనాధారం కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Nilagiri : మంత్రి కోమటిరెడ్డిని కలిసేందుకు వచ్చిన రైతుల అరెస్ట్