అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటన
ప్రభుత్వ పరంగా రైతన్నలను అన్ని రకాలుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే ప్రకృతి పరంగా అకాల వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెల మూడో వారంలో అకాల వర్షాలు పంట చేలపై ప్రకృతి ప్రకోపాన్ని చూపగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూతనందించింది. వెంటనే నష్టం అంచనాలు రూపొందించగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నష్ట పరిహారం అందజేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక తాజాగా శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతోనూ పలుచోట్ల మార్కెట్లలో ధాన్యం తడిసింది. దాంతో రైతుల్లో ఆందోళన నెలకొనగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ రైతులకు భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అకాల వర్షాలతో రైతాంగం అధైర్య పడకుండా భరోసా కల్పించాలని సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆ జిల్లా కలెక్టర్ వెంకటరావుతో మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు అందించారు. ఇక నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనను అర్థం చేసుకుని, ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్22 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పంట చేలపై ఉన్న వడ్లు కొంత మేర నేల రాలడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం అక్కడక్కడ తడిసింది. సాయంత్రం చీకటి పడ్డాక ఊహించని విధంగా వర్షం పడడంతో రైతులు ముందే తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులంతా వెంటనే రంగంలోకి దిగారు. వర్షం కురిసిన మండలాల్లోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులంతా ఉదయాన్నే క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఓ వైపు రంజాన్ పండుగ హడావుడి ఉన్నా… తాసీల్దార్ల నేతృత్వంలో అధికారులు వర్షంతో జరిగిన ఇబ్బందులను అంచనా వేస్తూ రైతులతో మాట్లాడారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేలా భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి ధాన్యం కొనుగోళ్లు జరుపుతుందని ఆత్మవిశ్వాసం కల్పించారు.
క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన
అకాల వర్షం నేపథ్యంలో నల్లగొండ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు క్షేత్రస్థాయిలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. అకాల వర్ష ప్రభావానికి గురైన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేశారు. నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిస్థితిని కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ భాసర్‌రావు నల్లగొండ మండలం చందనపల్లి పరిధిలోని రెడ్డిబావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వీరితో పాటు వర్ష ప్రభావమున్న ఇతర కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ, డీఎస్ఓ, డీసీఓ, సివిల్ సపె్లై డీఎం, అర్డీఓలు, స్థానిక తాసీల్దార్లు వేర్వేరుగా సందర్శించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు నివేదించారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు అధికారులు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
రైతులు అధైర్యపడొద్దు : కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి స్పందిస్తూ రైతుల అధైర్యపడవద్దని సూచించారు. కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రాత్రి అకాల వర్షానికి జిల్లాలో అకడకడ కొంత మొత్తంలో వరి ధాన్యం తడిసిందన్నారు. ప్రతి గింజా కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వారిగా ప్రతినిత్యం కొనుగోళ్ళపై సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఆకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు సహాకరించాలని మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కోరినట్లు కోరినట్లు చెప్పారు. ప్రస్తుత సీజన్లో అకాల వర్షాల ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి ధాన్యం సురక్షితంగా ఉండేలా తగిన జగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు పంపే వరకు, మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసే వరకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ 11వ తేదీ నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ఇప్పటివరకు 272 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 9380 మంది రైతుల నుంచి 78,392 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే ఇప్పటివరకు అత్యధికంగా ధాన్యం నల్లగొండలనే కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రతి రోజూ సరాసరి 10వేల నుండి 12 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
రైతులకు భరోసా కల్పించాలి
అధికార యంత్రానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశం
సూర్యాపేట, ఏప్రిల్ 22(నమస్తేతెలంగాణ) / సూర్యాపేట, ఏప్రిల్ 10 : అకాల వర్షంతో రైతాంగం అధైర్యపడకుండా భరోసా కల్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి రైతులకు భరోసా అందించి, వారిలో ధీమా కల్పించాలని కలెక్టర్ వెంకట్రావుకు సూచించారు. అకాల వర్షాలపై కెక్టర్ వెంకట్రావుతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు అందిస్తున్నారు. ఈ మేరకు ఉదయం నుంచి రంగంలోకి దిగిన కలెక్టర్ వెంకట్రావు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్ మోహన్‌రావుతో పాటు ఇతర అధికారులు హుటాహుటిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుని రైతులకు భరోసా అందిస్తున్నారు. రానున్న రోజుల్లో అకాల వర్షాలు సంభవించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు అధైర్యపడవద్దని ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.