ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా చూసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక కొరవడడంతో ధాన్యం కొనుగోళ్లే ఈ సారి ఆలస్యంగా ప్రారంభం కాగా ఇప్పుడు మరింత నెమ్మదిగా సాగుతున్న అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. గత 20 రోజుల్లో ఒక్కో కొనుగోలు కేంద్రంలో కనీసం 10శాతం ధాన్యం కూడా కొన్న దాఖలాలు లేవు. కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభి వదిలేశారు. దీంతో రైతులు ధాన్యం తెచ్చి కేంద్రాల్లో నిత్యం ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల నెల రోజుల కిందట తెచ్చి ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రభుత్వ ఆదేశాలతో కీలకమైన ధాన్యం కొనుగోలు సమయంలో సన్నబియ్యం పంపిణీ, భూ భారతి కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం నిమగ్నమై రైతులను గాలికి వదిలేసారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఏ క్షణాన అకాల వర్షం వచ్చి కొంప ముంచుతుందేమోనన్న తీవ్ర ఆందోళనలో రైతుల కొట్టుమిట్టాడుతున్నారు. గత వారం పది రోజులుగా అకాల వర్షాలు ధాన్యం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే.
యాసంగి ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వంతోపాటు జిల్లా అధికార యంత్రాంగాలు సైతం దీన్ని గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగా అంత సీరియస్గా తీసుకున్నట్లు లేదని రైతుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరిగి ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నెల చివరి వారం నుంచే కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి శ్రీకారం చుట్టినా అవి ఆచరణలోకి వచ్చే సరికి ఈ నెల 10వ తేదీ దాటింది.
గత నెల 15 తేదీ నుంచే ముందుగా నాట్లేసిన రైతులు ధాన్యం కేంద్రాలకు తేవడం మొదలుపెట్టారు. చాలా చోట్ల ఈ నెల ఫస్ట్ నాటికే ధాన్యం కేంద్రాలకు వచ్చింది. అధికార యంత్రాంగం మాత్రం అందుకు అనుగుణంగా కొనుగోళ్లు ప్రారంభించడంలో తాత్సారం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో సోమవారం నాటికి కొనుగోలు అంచనాల్లో కేవలం 15శాతం కూడా పూర్తి కాకపోవడమే అందుకు నిదర్శనం.
ఈ జిల్లాలో మొత్తం 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో సన్నాల కోసం 74, దొడ్డురకాల కోసం 212 కేంద్రాలను కేటాయించారు. వీటి ద్వారా ఇప్పటివరకు 9వేల మెట్రిక్ టన్నుల సన్నాలు, 34వేల మెట్రిక్టన్నుల దొడ్డు రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. వాస్తవంగా ఇక్కడ మొత్తం 3.50లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల అంచనా కాగా ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల సన్నాలు, 2.50లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉంది.
కానీ నేటికి 43వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. ఇక యాదాద్రి జిల్లాలో మరీ దారుణంగా కొనుగోళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 18,400 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. వాస్తవంగా ఇక్కడ 327 కేంద్రాల ద్వారా 4.50లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కేవలం 5శాతం కొనుగోళ్లే జరుపడంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నదనేది స్పష్టం అవుతుంది. ఈ జిల్లాలో గత పది రోజులుగా నిత్యం ఏదో ఒక చోట అకాల వర్షాలతో కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల వరదనీటిలో సైతం కొట్టుకుపోయిన దయనీయ పరిస్థితులు ఉన్నాయి.
ఇలా ఒకసారి ధాన్యం తడిస్తే మళ్లీ దాని ఆరబెట్టి నిర్దేశిత తేమ శాతం రావాలంటే కనీసం మరో వారం రోజులు సమయం తీసుకుంటుంది. దీనివల్ల కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పట్టాలతో పాటు కూలీలకు అదనంగా భారీగా ఖర్చు వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో మొత్తం ఈ సీజన్లో 5.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 375 కేంద్రాల ద్వారా నేటి వరకు 1.52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు.
ఇందులో సన్నాలు 2300 మెట్రిక్ టన్నులే ఉండగా మిగతాది అంతా దొడ్డురకం ధాన్యం ఉంది. ఈ జిల్లాలోనూ మారుమూల కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా హమాలీల సమస్య, లారీల కొరత, ధాన్యం దిగుమతి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలతో రోజుల కొద్దీ జాప్యం జరుగుతుండడంతో రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా దొడ్డురకం ధాన్యాన్ని సైతం నేరుగా అడ్డికిపావుశేరు లెక్క మిల్లర్లకు అమ్ముకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో రైతులు మద్దతు ధర కొల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు.
కొనుగోళ్లకు ఇవే ఆటంకాలు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో లారీల పాత్రనే చాలా కీలకం. అయితే చాలా చోట్ల లారీల కొరత వేధిస్తుంది. ఒక్కో కేంద్రానికి కేటాయించిన రెండు, మూడు లారీలు లోడ్లతో వెళ్లి మిల్లుల వద్దనే రెండు, మూడు రోజులు నిలిచిపోతున్నాయి. దీంతో వెంటవెంటనే ధాన్యం కొనుగోళ్లు జరుపడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మిల్లుల వద్దకు వెళ్లాక కూడా తాలు, తేమ పేరుతో మిల్లర్లు దిగుమతికి కొర్రీలు పెడుతుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఇక కొన్నిచోట్ల ధాన్యం ఎగుమతులు, దిగుమతులకు హమాలీల కొరత కూడా ఉంది. దీంతో నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక కొన్నిచోట్ల లారీల అవసరాలకు అనుగుణంగా కేంద్రాలకు పంపకపోవడంతోనే తీవ్ర ఆలస్యం జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
నెల దాటుతున్నా కొనే దిక్కేలేదు
మాకున్న నాలుగెకరాల్లో 1010 దొడ్డురకం వడ్లు పండించినం. ధాన్యం ఇక్కడ పోసి నెల రోజులు దాటుతున్నది. ఇప్పటివరకు వడ్లను చూసేవారు లేరు కొనేవారు లేరు. సహకార సంఘం ఛైర్మన్, సీఈఓను అడిగితే రేపు, ఎల్లుండని ఇన్ని రోజులు గడిపిండ్రు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
-ధనావత్ సైదా, రైతు, బడాయిగడ్డ, త్రిపురారం
కాంటాలు వేసినా లోడింగ్ కాలేదు
ఐదెకరాల పొలం కౌలుకు తీసకొని వరి పండించిన. అనంతారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటింది. 10 రోజులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టిన. కాంటాలు వేసి మూడు రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు లారీలో లోడింగ్ కాలేదు. లారీలో బస్తాలు వేసే వరకు రైతుదే బాధ్యత అంటున్నారు. వాన వస్తే ధాన్యం తడుస్తుందని భయమైతుంది.
-గండికోట నాగయ్య, రైతు, అనంతారం, పెన్పహాడ్