దామురచర్ల, జనవరి 30 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి వచ్చే నీటిని అధికార పార్టీ నేతలు కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని వీర్లపాలెం గ్రామ శివారులో గల అన్నవేరు వాగుపై ఉన్న ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి గ్రామాల పరిధిలో 4 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. జిల్లాలోనే పెద్ద ఎత్తిపోతల పథకం ఇది. ఈ లిఫ్ట్ నుంచి వచ్చే నీటిని ఉల్సాయపాలెం కాల్వకట్ట వద్ద ముదిమాణిక్యం మేజర్‌కు అనుసంధానం చేశారు.
మరో కాల్వ వీర్లపాలెం నుంచి దుబ్బతండా వరకు నీటిని అందిస్తుంది. దీని ఆధారంగా అనేక మంది చిన్న, సన్న కారు రైతులు రెండు కార్లు ఆరుతడి పంటలను పండిస్తుంటారు. కాగా, ఐదారు నెలల కిందట ఎత్తిపోతల నుంచి వచ్చే కాల్వ పరిధిలో మూడు చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సమాంతరంగా పెద్ద పెద్ద బావులను తవ్వి, కాల్వకు గండ్లు పెట్టి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. బావుల్లో నీటిని నిల్వ చేసి పైన ఉన్న రేగడి పొలాలకు మోటర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకుగానూ పైనున్న రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఫలితంగా దిగువన ఉన్న పంటలకు సాగు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నవేరు వాగుకు నీటి ప్రవాహం తగ్గుతున్నందున రానున్న రోజుల్లో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని, బావుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి బావులను తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎన్ఎస్పీ ఏఈ వెంకటనారాయణను నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. బావులు తవ్వి ఎత్తిపోతల నీటిని అక్రమంగా నిల్వ చేస్తున్న సంగతి తమ దృష్టికి రాలేదని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.