అర్వపల్లి మే 26:: కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడం లేదంటూ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బస్తాకు రెండు కేజీల వడ్లను తరుగు పేరుతో తీసేస్తున్నారు.
ఇంచార్జిగా ఉండే కొంతమంది వ్యక్తులు కాంటా అయిపోయిన తర్వాత రైతుల నుంచి తమకేం లేదా అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న 25 కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి వడ్లు పోసి ఎప్పుడు కొంటారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.