కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. అదునులోపు పంటకు యూరియా వేస్తే దిగుబడి వస్తుందని అన్నదాతలు ఎరువు కోసం రెండు నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు యూరియా ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించడమే పనిగా మారింది. బస్తా యూరియా కోసం సొసైటీల ఎదుట రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థతి నెలకొంది. ప్రస్తుతం లక్ష రూపాయలు అప్పు పుడుతోంది కానీ ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎన్ని రోజులు ఇలా సొసైటీల చుట్టు తిరగాలి.. మా బాధలు సర్కార్‌కు పట్టావా.. అంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొండమల్లేపల్లిలోని రైతు సేవా సహకార సంఘం కేంద్రానికి యూరియా లారీలు వచ్చాయని తెలియడంతో ఉదయం 6 గంటలకే రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. ఓపిక నశించి చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి పడిగాపులు కాశారు. అదివారం స్థానిక ఎస్ఐ అజ్మీర రమేష్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు దాదాపు 1200 వందల మంది రైతులకు టోకెన్లు అందజేశారు. నాలుగు రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్న యూరియా అందడం లేదని టోకెన్లతో సరిపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటల సీజన్లో రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ ఆరోపించారు. తెలంగాణ రాష్ర్టానికి కేసీయారే శ్రీరామరక్ష అని, మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
నూతనకల్, సెప్టెంబరు 17 : నూతనకల్‌లో యూరియా కోసం రైతులు సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.