ఏడాదిన్నర పాలనలో అన్ని రంగాల్లోనూ విఫలమవుతూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మ త్స్య కారుల నోట్లో మట్టికొట్టింది. బీఆర్ఎస్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో చెరువుల్లో చేపపిల్లలను వదలడంతో వేల టన్నుల పంట చేతికి వచ్చి మత్స్యకారుల జీవితాలు మెరుగుపడ్డాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ పాతరోజులే పునరావృతం అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023లో జిల్లాలో 21,421 టన్ను ల చేపలు ఉత్పత్తి కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2024లో దాదాపు 70 శా తం తగ్గి కేవలం 7,610 టన్నులకు చేరిం ది. ఈ ఏడాది సైతం జిల్లాలోని 80శాతం చెరువులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం చేప విత్తనం వేసేందుకు ప్రణాళికలకే పరిమితమైంది తప్ప ఒక్క చేపపిల్లను కూడా వేయలేదు.
సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కుల వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న మత్య్సకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మత్స్య కారులకు ఉపాధి కల్పించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఆరేడేళ్ల పాటు నిరంతరాయంగా నీటిని అందించడంతో జిల్లాలో ఇంచుభూమి మిగలకుండా సాగులోకి వచ్చింది. 2017-18 నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్న 2023 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు ఏడాది పాటు జలకళతో ఉట్టిపడేవి. దీంతో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ఏటా మత్స్యకారులకు లక్షలాది రూపాయల లబ్ధి చేకూరింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు మళ్లీ గత ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి.
నాడు వరం… నేడు గ్రహణం..
ఆరేడేళ్ల పాటు పుష్కలంగా చేప పంట చేతికి వస్తే కాళేశ్వరం నీటిని బంద్ చేసి చెరువుల్లో నీళ్లు లేకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొడుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం జలాలు రావడంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని చెరువులు మండు వేసవిలో సైతం అలుగులు పారేవి. దీంతో 2017-18 నుంచి 2022-23 వరకు నుంచి ఆరేండ్ల పాటు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదిలేది. పోషకాహర విలువలు అధికంగా ఉండే ప్రాన్స్‌తో పాటు బొచ్చ, రవ్వ, బంగారు తీగ, వంటి రకరకాల చేప విత్తనాలను చెరువుల్లో వదిలేవారు.
జిల్లాలో ఏటా 640 నుంచి 660 చెరువుల్లో ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను వదలడంతో జిల్లాలోని దాదాపు 141 మత్స్య సహకార సంఘాల్లోని సుమారు 14 వేల మందికి పైగా మత్స్య కారులకు ఏటా నయాపైసా పెట్టుబడి లేకుండానే దాదాపు 130 నుంచి 150 కోట్ల రూపాయల విలువ చేసే 20 నుంచి 22వేల టన్నుల చేప పంట చేతికి వచ్చింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు గ్రహణం పట్టింది. గతేడాది 70 శాతం చెరువుల్లో చేప పిల్లలు వేయకపోగా ఈ ఏడాది అతీగతీ లేదు. ప్రతి ఏటా మే, జూన్ నెలల్లోనే చేప పిల్లలను చెరువుల్లో వేయగా ఈ సంవత్సరానికి సంబంధించి ప్రణాళికలకే పరిమితం కావడం పట్ల మత్స్య కారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 70 శాతం చెరువుల్లో నీళ్లు లేకపోయినా ప్రణాళికలు మాత్రం వందశాతం వేసేలా తయారు చేయడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఈ విషయమై జిల్లా మత్స్య శాఖ అధికారి నాగులు నాయక్‌ను వివరణ కోరగా వంద శాతం చెరువులకు ఇండెంట్ తయారు చేస్తామని చెరువుల్లో నీటిని బట్టి చేపవిత్తనాలను వదులుతామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చేపల ఉత్పత్తి బాగుండేది
పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాల ద్వారా చెరువులు, కుంటలు పూర్తిగా నిండి చేపలు పెద్ద సైజులో పెరిగేవి. దీంతో లాభాలు వచ్చేవి. మత్స్య కార్మికులకు ఉచితంగా చేప పిల్లలు, వాహనాలు ఇవ్వడంతో ఆత్మ స్థయిర్యం పెరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేక చాలా వరకు చేపలు చనిపోయాయి. ఏ చెరువులో చూసినా చేపలు తక్కువ మొత్తంలోనే ఉంటున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.