పెన్పహాడ్, ఫిబ్రవరి 13 : పైరుకు అదును దాటుతున్నా యూరియా అందడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పెన్పహాడ్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట నేరేడుచర్ల -సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గత వానాకాలం సీజన్లో కూడా యూరియా కొరత ఏర్పడిందన్నారు. యాసంగి వరి సాగుకు యూరియా కావాలని అడిగినా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందస్తు ఆలోచన లేదని రైతుల గోస పట్టడంలేదని వాపోయారు.
పెన్పహాడ్ సహకార సంఘ కార్యాలయానికి ఒక లారీ లోడు వస్తే యాప్లో ఒక్క నిమిషాల్లోనే రైతులు బుక్ చేసుకున్నారని తెలిపారు. చదువురాని వారు, స్మార్ట్ ఫోన్లు లేని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ వల్ల బుకింగ్ చేసుకోవడం తెలియక ఆందోళన చెందుతున్నారన్నారు. యాప్ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రెండోసారి యూరియా వేయాల్సిన పొలాలకు సరియైన సమయంలో అందక పోవడంతో దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యాప్ను తొలగించి యథావిధిగా యూరియా అందించాలని కోరారు.
ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భూమి సొంతం కాకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే వీరు, ఇప్పుడు యూరియా కోసం యాప్ల చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. చాలామంది కౌలు రైతుల వద్ద స్మార్ట్ఫోన్ కూడా లేకపోవడంతో ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. అప్పటికే స్టాక్ ఖాళీ అవుతుండటంతో వారి ప్రయత్నాలు ఫలించకపోతున్నాయి. పట్టాదారు పాస్బుక్ ఆధారంగా జరిగే యాప్ బుకింగ్ కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం వారి కష్టాలను రెట్టింపు చేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెన్పహాడ్లో యూరియా కోసం రైతుల ఆందోళన