యాదగిరిగుట్ట, జూన్ 20: కాంగ్రెస్ ప్రభు త్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తోంది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు మండల వ్యవసాయాధికారి కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన ఆందోళనే నిదర్శ నం. శుక్రవారం పట్టణంలోని ఏవో కార్యాలయానికి పలు గ్రామాలకు చెందిన రైతులు వచ్చి తమకు అరకొరగా రైతుభరోసా నగదు జమ అయిందని, ఎంతవరకు పడిందో అర్థం కావడంలేదని వ్యవసాయాధికారులను ప్రశ్నించారు.
ఇంతకి రైతు భరోసా వస్తుందా రాదా అంటూ అధికారులను నిలదీయడంతో వారు ఇబ్బందులు పడ్డారు. మరికొద్దిరోజుల్లో అందరికీ రైతు భరోసా అందుతుందని సమాధానం చెప్పడమే తప్ప వారి వద్ద సరైన సమాధానం లేకుండా పోయింది. ఇప్పటివరకు తనకు ఉన్న వ్యవసాయ భూమికి రైతుభరోసా రావడం లేదని గౌరాయిపల్లికి చెందిన రైతు వనగంటి సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2000 ఖాతాలో జమ అయ్యాయని, అవి ఎక్కడివో అర్థం కావడంలేదని అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు.
రామాజీపేటకు చెందిన రైతు తునికి ఆంజనేయులు తనకు ఉన్న 5 ఎకరాల భూమికి గతంలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమఅయ్యేదని, కానీ గత రెండు దఫాలుగా రైతుభరోసాతో పాటు రుణమాఫీ సైతం మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సొంత మండలంలోనే రైతులకు రైతు భరోసా మంజూరు కాలేదంటే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ అన్నారు. వెం టనే ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు రైతు భరోసాను అమలు వారు ప్రభుత్వాన్ని చేయాలని డిమాండ్ చేశారు.
నాపేరు రామిరెడ్డి, మాది మండలంలోని గౌరాయిపల్లి గ్రామం. నాకు 2.09 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులో వ్యవసాయం చేసుకుంటూ వివిధ పంటలను పండిస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో రైతుబంధు నగదు ఖాతాలో జమ అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా రైతుభరోసా రాకపోగా ఈసారి కేవలం 25 గుంటలకు మాత్రమే రైతు భరోసా అందింది. మిగతా భూమికి ఇస్తరో లేదో తెలియదు.
– రామిరెడ్డి, రైతు, గౌరాయిపల్లి గ్రామం, యాదగిరిగుట్ట మండలం