కోదాడ, జూలై 22 : కోదాడ పట్టణ పరిధిలోని ఓ మద్యం దుకాణంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం నకిలీ మద్యాన్నిపట్టుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పరిసర ప్రాంతాలతోప ఆటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్న ముఠాను సోమవారం పట్టుకున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో కోదాడ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమై మంగళవారం పలు మద్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సూర్యాపేట రోడ్లోని ఓ మద్యం దుకాణంలో అనుమానంతో మద్యం సీసాలను స్టేషన్కు తరలించారు.
ఆ మద్యంలో కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకునేందుకు వరంగల్ పంపిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు. రామాపురం గ్రామంలో మద్యం పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందంటున్నారు. ఆ మద్యం సీసాలను నేరుగా అమ్మకుండా షాపుల్లో తాగేవారికి పెగ్గుల రూపంలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తే కల్తీ మద్యం జాడలు మరింత బహిర్గతం అవుతాయంటున్నారు.