యాదాద్రి భువనగిరి, మే 16 (నమస్తే తెలంగాణ) ః యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ యంత్రాగం విఫలమైంది. జిల్లాలో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టింపు లేకుండా ఉంది. ముందస్తు ప్రణాళిక లోపంతో అన్నదాత అరిగోస పడుతున్నాడు. గోదాముల్లో స్థలాభావ సమస్యతో ఇబ్బందులు తప్పడంలేదు. పైగా ఖమ్మం జిల్లా మక్కలు ఇక్కడ అన్లోడ్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్లాల్లో వడ్లు రాశులుగా పోసి వారాలు, నెలలు కావస్తున్నా కాంటా వేయడంలేదు. కొన్ని చోట్ల కాంటాలు వేస్తున్నా అన్లోడ్ చేసే దిక్కు లేదు. ఇంకో వైపు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 351కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనేక చోట్ల పీపీసీలను ఆలస్యంగా తెరిచారు. ఏప్రిల్ నెలాఖరులోనే 1.50లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా జిల్లాలో ఈ నెల 15వ తేదీ నాటికి 1,55,140 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొన్ని సెంటర్లలో నెల రోజులైనా ధాన్యం కాంటా వేయడంలేదు. ఉదాహరణకు.. భువనగిరి మండలంలోని వీరవల్లి కొనుగోలు కేంద్రంలో నెల రోజుల క్రితం 120 మంది రైతులు ధాన్యాన్ని తెచ్చారు. ఇప్పటి వరకు కేవలం 20 మంది నుంచి మాత్రమే వడ్లు సేకరించారు. మిగతా వంద మంది లైన్లోనే ఉన్నారు. ప్రభుత్వం ఇలానే కొనుగోలు చేసుకుంటూ పోతే తమ సీరియల్ వచ్చేసరికి వచ్చే సీజన్ అవుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక లారీలు, హమాలీ కొరత ఉన్నది. ఒక్కసారి వచ్చిన లారీలు మళ్లీ రాకుండా అటే పోతున్నాయి. ధాన్యం దిగుమతికి సైతం ఇబ్బందులు తప్పడంలేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి సీజన్లో 3.14లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 6.90లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. దిగుబడి బాగా రావడంతో ఇది ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ముందస్తు ప్రణాళిక చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలోని మిల్లుల్లో ఇప్పటికే రెండు సీజన్ల ధాన్యంతో గోడాములు నిండిపోయాయి. అవి ఖాళీ చేస్తేనే ఇప్పుడు కొంటున్న ధాన్యం దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఖాళీ స్థలం లేకపోవడంతో మిల్లర్లు అన్లోడ్ చేసుకోవడంలేదు.
ఖమ్మం మక్కలు మనకు.. మన వడ్లు ఇతర జిల్లాలకు ఓ వైపు గోదాముల్లో స్థలాభావ సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు ఖమ్మం జిల్లా మక్కలను మన దగ్గర అన్లోడ్ చేస్తుండటం విచిత్రకరంగా మారింది. ఖమ్మం జిల్లా నుంచి 250 లారీలు వలిగొండ మండలంలో ఉన్న గోదాముల్లో అన్లోడ్ చేస్తున్నారు. ఇక జిల్లాలో స్థలం లేకపోవడంతో ఇతర జిల్లాలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వడ్లను తరలించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటుంటే అధికారులు మౌనం వహిస్తున్నారు. హమాలీల కొరత, ధాన్యం రవాణా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, టోకెన్ ఆలస్యం, తేమ పేరుతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 40 కిలోల ధాన్యం బస్తాకు 600 గ్రాముల గన్నీ బస్తా బరువు మినహాయింపు చేస్తుండగా, తరుగు పేరుతో మరో రెండు నుంచి మూడు కిలోల వడ్లను దోపిడీ చేస్తున్నారు. పొడుగు, పొట్టి ధాన్యం పేరుతో ధాన్యాన్ని తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు తీరుతో క్వింటా ధాన్యానికి వందల రూపాయలు నష్టపోవాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు సర్కారు సరిగా కొనకపోవడంతో రైతులు ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2380 ఉండగా, వరుణుడి భయంతో క్వింటాల్‌కు రూ. 1400 నుంచి రూ. 1800కి అమ్మేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.