అనంతగిరి, అక్టోబర్ 24 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, మిల్లులకు అలాట్మెంట్ ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ధాన్యాన్ని సేకరించడం లేదని విమర్శించారు. వరుస తుఫానుల ప్రభావంతో ధాన్యం తడిసిపోతుందని, కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని కోరారు. గత వానకాలం, యాసంగిలో కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి నెలలు గడిచినా ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదన్నారు.
రైతులకు యూరియా సరిపడా అందించడంలో, బోనస్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. యాసంగి సీజన్లో ఆరుగాలం కష్టపడి రైతులు వరి పంటను పండించారని, మండుటెండలను సైతం లెక్కచేయకుండా బోనస్‌పై ఆశతో ఎండలో వడ్లను ఆరబెట్టారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు అఫ్జల్, సీనియర్ నాయకులు పందిరి వీరయ్య, అజ్మీర శ్రీను, జయరాం, పూర్ణచంద్రరావు, వెంకటరత్నం, చార్లెస్, ఏడుకొండలు, రామకృష్ణ, చలమయ్య పాల్గొన్నారు.