సూర్యాపేట, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : నెలనెలా వసూళ్లతో సంబంధం లేకుండా కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణల నుంచి గుడ్‌విల్ పేరిట ఆబ్కారీ శాఖ వసూళ్ల దందా ప్రారంభించింది. గతంలో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేయగా ఈ సారి అమాంతం పెంచి రూ.1.50 లక్షలకు పెంచి పదిహేను రోజుల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని 93 దుకాణాల నుంచి గుడ్‌విల్ కింద కోటిన్నర వసూలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఆ శాఖకు చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఓ కానిస్టేబుళ్లతో వసూళ్లు ప్రారంభించారని, ఒకవేళ ఎవరైనా కాదంటే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారట. ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వసూళ్లు పూర్తి కాగా తుంగతుర్తిలో ఓ ప్రజాప్రతినిధి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా సూర్యాపేటల్లో మూడు రోజుల క్రితమే ప్రారంభమైనట్లు సమాచారం. గత బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన మద్యం దుకాణాల గడువు ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. దీంతో షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1న ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మద్యం షాపులను కొత్తగా ప్రారంభించిన ప్రతీ సారి గుడ్‌విల్ పేరిట వేలల్లో వసూలు చేయడం మామూలుగా మామూలే. అయితే నేడు ఏకంగా షాపు ఒక్కంటికి రూ.లక్షన్నరకు పెంచేశారు. ‘గుడ్‌విల్ ఇవ్వాల్సి ఉంటుంది… కింది నుంచి పై స్థాయి వరకు పంచాల్సి ఉంటుంది’ అని గత ఇరవై రోజుల క్రితం మద్యం షాపులన్నింటికీ సమాచారం ఇచ్చారట.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా పరిస్థితి లేదు. సారా అయినా అమ్మండి…డబ్బులిచ్చుకోండి.. ఎన్ని అక్రమాలకు పాల్పడతారో పాల్పడండి… పాలకులు పట్టించుకోరు.. కొంతమంది మద్యం షాపుల నుంచి డబ్బులు ఆశిస్తున్నారు.. కాబట్టి మీరు కల్తీ మద్యం అమ్ముకోండి… అవసరమైతే పిచ్చి సారా బాటిళ్లలో నింపి అమ్మండి.. కానీ మేం మాత్రం గుడ్‌విల్‌తో పాటు నెలనెలా ఇచ్చే మామూళ్లను వదులుకునే ప్రసక్తే లేదంటూ వసూళ్ల కోసం తిరిగే వారు చెబుతున్నారని పేరు బహిర్గతం చేసేందుకు ఇష్టపడని ఓ మద్యం వ్యాపారి తెలిపారు. నెలనెలా మామూళ్లంటే ఇస్తాం.. కానీ ఈ గుడ్‌విల్ ఏమిటని కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారు ప్రశ్నిస్తే ..మీకు మా సంగతి తెలియదు గతంలో షాపులు నడిపిన వారితో మాట్లాడితే తెలుస్తుందని ఆబ్కారీ శాఖ చెబుతోందని వాపోతున్నారు. జిల్లాలో 93 మద్యం షాపులు ఉంటే బెల్టు షాపులు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు.. ఊరూ రా గల్లీ గల్లీలో ఉన్న బెల్టు షాపులకు మీ షాపుల నుంచే మద్యం వెళుతుంది అక్కడ రైడ్ చేస్తే కేసులు ఎవరి వరకు వస్తాయో మీకు తెలుసంటూ మద్యం వ్యాపారులను బెదిరిస్తున్నారట. ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో దాదాపు వసూళ్ల పర్వం పూర్తి కాగా తుంగతుర్తిలో ఓ ప్రజాప్రతినిధి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా సూర్యాపేటలో మాత్రం మూడు రోజుల క్రితమే వసూళ్లు మొదలయ్యాయని తెలిసింది. ఆబ్కారీ వారు గుడ్‌విల్ వసూ లు చేస్తుండగా నెలనెలా ఆ శాఖతో పాటు పోలీసు శాఖకు కూడా మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుందని పాత వ్యాపారులు చెబుతున్నారు. అయితే మరి ..మద్యం ప్రియులకు కల్తీ మద్యమే అందుతుంది తప్ప నిజమైన బ్రాండ్ అందకపోవచ్చు. జిల్లాలో గుడ్‌విల్ పేరిట అక్రమ వసూళ్ల విషయమై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్‌ను వివరణ కోరగా అలాంటిదేమీ తన దృష్టికి రాలేదన్నారు.