రామగిరి, అక్టోబర్ 1 : ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో డీఎస్సీ-2024 అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను సోమవారం విడుదల అవగా.. జిల్లా వారీగా ర్యాంకులు వెల్లడించిన విద్యాశాఖ ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా 1:3 పద్ధతిలో మంగళవారం నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని ప్రకటించింది. కానీ, ఎవరు ఎంపిక అయ్యారు అనేది అభ్యర్థులకు మెసేజ్, మెయిల్ పంపలేదు.
మంగళవారం సాయంత్రం వరకు కూడా జాబితా విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 1:3 జాబితా ఎప్పుడు వస్తుందని ఉత్కంఠతో ఎదురుచూశారు. రాత్రి 8:20 గంటలకు ఎస్జీటలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖకు లింక్ వచ్చినప్పటికీ అది ఓపెన్ అవకపోవడంతో ఇబ్బంది పడ్డారు. రాత్రి 9గంటల వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించిన లింక్ రాలేదు.
సమాధానం కరువు…
1:3 పద్ధతిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన మంగళవారం ఉదయం 10గంటల నుంచి ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి బి.భిక్షపతి సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో గల డైట్లో పరిశీలన కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆ మేరకు డైట్లో విద్యాశాఖ యంత్రాంగం టెంట్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించింది. ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసింది. కాగా, ఎవరి సర్టిఫికెట్లు పరిశీలన చేయాలి, 1:3 అభ్యర్థులు ఎవరనే జాబితా రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఎవరూ హాజరు కాలేదు. కొంతమంది అభ్యర్థులు మాత్రం డైట్‌కు వచ్చి జాబితా ఎప్పుడు వస్తుందని అధికారులను అడగ్గా, వారు సమాధానం చెప్పలేకపోయారు.