నార్కట్పల్లి డిసెంబర్ 4 : ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్పల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి దూదిమెట్ల సత్తయ్య యాదవ్, వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల గుర్తులను ప్రజలకు చూపిస్తూ కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి వర్గానికీ అన్యాయం చేసిందని, కాంగ్రెస్ మాయమాటలతో రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలయిందని, బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. కార్యకర్తలను కడుపులో పెట్టకొని చూసుకుంటున్నది గులాబీ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమ లు చేయలేదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.