నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంగాణ) : నల్లగొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా ముగిసింది. చెప్పుకోదగ్గ సంఘటనలేవీ చోటుచేసుకోలేదు. దాంతో ఎన్నికల అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మోరాయింపులు అనేవి ఎప్పటిలానే కనిపించాయి. కొద్ది సేపట్లోనే సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. చిట్యాల మండలం ఉరుమడ్ల 92వ కేంద్రంలో ఈవీఎం మోరాయించడంతో పోలింగ్ 45 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. ఇక్కడే ఓటు వేయాల్సిన నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కూడా క్యూలైన్లో వేచి చూడక తప్పలేదు. ఇదే మండలం గుండ్రాంపల్లిలోని 62వ బూత్‌లో ఈవీఎంలో సమస్యతో రెండు గంటలు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. నేరడుచర్ల మండలం కల్లూరులోని 10వ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర ఆలస్యమైంది. నిడమనూరు మండలం బంకాపురంలో ఈవీఎం సమస్యతో 35 నిమిషాలు ఆలస్యమైంది. మోత్కూరు మండలం అనాజిపురంలో ఈవీఎంలో సమస్యతో 45 నిమిషాల ఆలస్యమైంది. చౌటుప్పల్‌లోని లింగోజిగూడెంలో 26వ బూత్‌లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. చెరుకుపల్లి, జాజిరెడ్డిగూడెంలలోనూ ఈవీఎంలో సమస్య తలెత్తి అంతరాయం కలిగింది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంతో పాటు భూదాన్ పోచంపల్లిల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వర్షం నీరు నిలువడంతో ఓటర్లను అసౌకర్యానికి గురిచేసింది.
పోచంపల్లి మండలం కనుముకులలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందంటూ ఆందోళనకు దిగారు. తమ ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటింగ్‌కు వస్తామంటూ ఓటింగ్‌ను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. దాంతో ఉదయం పూట పోలింగ్‌కు ఓటర్లు రాక వెలవెలబోయింది. తర్వాత తాసీల్దార్ వచ్చి హామీ ఇవ్వడంతో ఓటింగ్‌కు హాజరయ్యారు. ఇక నకిరేకల్ జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఓటరు తన భార్య ఓటును తొలగించారంటూ గేటుకు తాళం వేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వ్యక్తి ఘర్షణకు దిగడంతో ఓ సీఐకి స్వల్ప గాయమైనట్లు తెలిసింది. ఇక రాజాపేట మండలం సింగారంలోని 86 పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ అభ్యంతరం తెలుపడంతో కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది. ఇక్కడ బ్యాలెట్ యూనిట్‌పై కాంగ్రెస్ హస్తం గుర్తు వద్ద మార్కర్‌తో మార్క్ చేసి బయటకు వచ్చి ఓటర్లకు చెప్పి ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని ఆందోళనకు దిగడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఎన్పీఎస్ పోలింగ్ బూత్‌లో, కోదాడలో మంత్రి ఉత్తమ్ దంపతులు ఓటు వేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలోని శ్రీచైతన్యస్కూల్ పీఎస్‌లో ఓటు వేశారు. నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి నక్కలపల్లిలో, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి వడపర్తిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన స్వగ్రామం ఉరుమడ్లల్లో, కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి తన తండ్రి జానారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నందికొండలో ఓటేశారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లిలో, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి శాలిగౌరారంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడెంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖలంతా కూడా తమ సొంతూళ్లల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పోలింగ్ సరళిని పరిశీలించారు.