నల్లగొండ, జూన్ 4 : నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. నల్లగొండలోని అనిశెట్టి దుప్పలపల్లి ఎస్‌డబ్ల్యూసీ గోదాంలో శుక్రవారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగగా.. పోస్టల్ బ్యాలెట్ల కారణంగా మరో గంట ఆలస్యం అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘవీర్‌రెడ్డి గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ప్రకటించారు. ఈ ఎన్నిక గత నెల 13న నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలతోపాటు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జరిగింది. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం నిర్వహించగా.. ఆర్వో, నల్లగొండ కలెక్టర్ హరిచందన పర్యవేక్షణలో సజావుగా సాగింది. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌కు ఆధిక్యత రావడంతో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు మధ్యలోనే వెళ్లిపోయారు. కౌంటింగ్ పూర్తయ్యాక రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలూనాయక్, కుందూరు జైవీర్‌రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, ఉత్తమ్ పద్మావతితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. వారి సమక్షంలో రఘువీర్‌కు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
పాలనపైనే దృష్టి పెడుతాం : మంత్రి కోమటిరెడ్డి
ఎన్నికలు పూర్తయినందున ఇక నుంచి పాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి పెండింగ్ ప్రాజెక్టులు కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు ఎక్కువ మెజారిటీ కట్టబెట్టి మరింత బాధ్యత పెంచారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తామని అన్నారు. అనంతరం కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల అభిమానాన్ని మరువకుండా వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతానని తెలిపారు.