– ఆపరేషన్ స్మైల్‌లో 176 మంది రెస్క్యూ
సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 02 : బాలల వికాసానికి, వారి బంగారు భవిష్యత్‌కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెట్టి చాకిరికి, నిరాదరణకు గురైన బాలబాలికలు, తప్పిపోయి వచ్చిన బాలలను గుర్తించి సంరక్షించడంలో బాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 176 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సమరక్షులకు క్షేమంగా అప్పగించడం జరిగినదన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56 మందిలో 49 మంది బాలురు, 7 గురు బాలికలు ఉన్నారన్నారు.
అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది బాలలు ఉండగా వీరిలో 80 మంది బాలురు, 40 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ టీమ్స్ వివిధ ప్రదేశాల్లో వీరందరినీ గుర్తించి రక్షణ కల్పించడం జరిగినదన్నారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి బాలల వికాసానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలన్నారు. బాలల రక్షణలో పోలీసు తనిఖీలు నిరంతరంగా నిర్వహిస్తామన్నారు. బాలలను వెట్టిచాకిరి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పోలీస్ ఐటీ అర్ఎస్ఐ రాజశేఖర్, చైల్డ్ సంరక్షణ అధికారులు రవి, నాగుల మీరా, స్మైల్ బృందం ఎస్ఐ మల్లేశం, ఏఎస్ఐ వెంకన్న, స్మైల్ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.