– తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్
తుంగతుర్తి, జనవరి 16 : రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడుతుందని కావునా అంతా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, కానిస్టేబుళ్లు, స్టాఫ్ నర్సులు, మొగలగాని వంశీ, పక్కినపల్లి నరేశ్, భాషబోయిన వెంకన్న పాల్గొన్నారు.