తుంగతుర్తి, మే 13 : ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రజా ప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జరుగుతున్న విద్యా వారోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నియోజకవర్గ సర్పంచుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా అల్పాహారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సర్పంచులు విధిగా పాఠశాలలను సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తూ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, రాత పుస్తకాలు, పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్, 24 వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న జిల్లా సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, సూర్యనారాయణ, పలు మండల విద్యాధికారులు లింగయ్య, రాములు నాయక్, బాలు నాయక్ ,శాంతయ్య, ప్రభాకర్, రవికుమార్, అన్ని గ్రామాల సర్పంచులు, తిరుమలగిరి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.