సూర్యాపేట, జూలై 31 : పదో తరగతి నుంచే విద్యార్థుల తొలి మెట్టు మొదలవుతుందని, అప్పుడే వారు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ ప్రభుత్వ పాఠశాల, గిరినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు.
పదో తరగతి నుంచే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు నాలెడ్జ్, నైపుణ్యం, పర్సనాలిటీ డెవలప్మెంట్పై వివరించారు. ఆటలు, స్నేహితులు ఉండాలని, కానీ దేనికి ఇచ్చే సమయం దానికి ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు డ్రాయింగ్‌లో సైతం మంచి మెళకువలు చెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అంతకు ముందు గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ అన్ని పరీక్షలు చేయాలని ఆదేశించారు. బ్లెడ్ షాంపిల్స్‌ను టీ హబ్‌కు రెగ్యులర్‌గా పంపాలని తెలిపారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు ఎధిపతిరావు, మెడికట్ ఆఫీసర్ శివప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మ, ఏఎన్ఎం సువర్ణ పాల్గొన్నారు.