నేరేడుచర్ల, జూన్ 07 : మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, దాని కోసం అంతా కృషి చేయాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 6, 10 వార్డుల్లో తడి – పొడి చెత్తను వేరుచేయడం, చెత్తతో ఎరువు తయారీ విధానంపై ర్యాలీ తీసి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా తడి – పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య వాహనాలు వచ్చిన సమయంలో దాంట్లో వేయాలని సూచించారు. వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేసే నీటిని క్లోరిన్ టెస్టులు చేసి పరిశీలించారు. అనంతరం నిరుపేద మహిళలను గుర్తించి సమభావన సంఘాలు ఏర్పాటు చేయడానికి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జిలకర రామస్వామి, రిటైర్ట్ ఉద్యోగి పూర్ణచంద్రా రెడ్డి, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Nereducherla : మున్సిపాలిటీ పరిశుభ్రతకు అంతా కృషి చేయాలి : మున్సిపల్ కమిషనర్ అశోక్‌రెడ్డి