ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 28 : ఆత్మకూర్.ఎం మండలంలో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. సాగునీటి వసతి లేక, భూగర్భజలాలు ఇంకిపోయి ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పైర్లు కండ్ల ముందు ఎండిపోతుండడంతో కాపాడుకునేందుకు రైతులు నానా గోస తీస్తున్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన రైతు హన్మంతుల సత్తయ్యకు ఆరెకరాల భూమి ఉంది. తనకున్న వ్యవసాయ బావి ఆధారంగా ప్రతి సీజన్లో వరి సాగు చేస్తుంటాడు. ఈ యాసంగిలోనూ వరే పెట్టాడు. కానీ ప్రస్తుతం బావిలో నీళ్లు అడుగంటాయి. పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు 3లక్షల రూపాయలు ఖర్చు చేసి క్రేన్ సాయంతో పుడిక తీయించినా చుక్క నీరు ఊరలేదు. ఉన్న బోరు కూడా ఆగి ఆగి ఇంట్లో నల్లా లెక్క పోస్తున్నది. దాంతో ఆరెకరాల్లో ఇప్పటికే నాలుగు ఎకరాల వరి పంట ఎండిపోయింది. ఉన్న రెండెకరాలను ఎలా కాపాడుకోవాలో తెలియక సత్తయ్య అవస్థ పడుతున్నాడు.